బంగారు తెలంగాణ సాధనే
కొండాకు అసలైన నివాళి
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అన్ని వర్గాల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతిని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఆయన ఘనంగా నివాళి అర్పించారు. బాపూజీ నిస్వార్థ సేవలను స్మరించుకొన్నారు. ఈ సందర్బంగా భాస్కర్ రావు మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధించడమే బాపూజీకి అసలైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ కలలను నెరవేరుస్తూ తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధిపథంలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తున్నదని పేర్కొన్నారు.

బాపూజీ జయంతిని, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. స్వరాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని భాస్కర్ రావు తెలిపారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందజేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం వినూత్న పథకాలను అమలుచేస్తూ పద్మశాలీల అభ్యున్నతికి పాటుపడుతున్నదని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప ప్రజాస్వామికవాది. గాంధీజీ స్ఫూర్తితో దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, అవే విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేశారని తెలిపారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని ఆయన వెల్లడించారు. మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిల పక్షాల ఆధ్వర్యంలో బుధవారం తీసిన ర్యాలీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు భాస్కర్ రావు ప్రకటించారు. అంతేగాకుండా వచ్చేనెలలో మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దృష్టికి, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని అభ్యర్థించనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడను జిల్లాగా చూడాలనే నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను తీర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయనున్నట్టు భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, నల్లగంతుల నాగభూషణం, తిరందాస్ విష్ణు, తదితరులు పాల్గొన్నారు.