ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకోవలసిన కఠిన చర్యలు

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకోవలసిన కఠిన చర్యలు

అవినీతి, అధికార దుర్వినియోగం, రాజ్యాంగ ఉల్లంఘనల పైన ఉక్కు పాదం మోపాలి.

ఓటర్ల ప్రలోభాలపై కటినచర్యలతో ఈసీ తన సత్తా చాటుకోవాలి

ఆ దృఢ నిర్ణయం తెలంగాణతోనే మొదలు కావాలి.

ముత్యాల రమేష్, అక్షిత జాతీయ దినపత్రిక స్టాప్ రిపోర్టర్:

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం 9 అక్టోబర్ 2023 సోమవారం రోజున షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే, నవంబర్ 3 తో నోటిఫికేషన్ విడుదల కాగా ఎన్నికల ప్రక్రియ నవంబర్ 30 ముగిసిపోతే డిసెంబర్ 3 తేదీన ఐదు రాష్ట్రాల ఫలితాలతో పాటు తెలంగాణలో కూడా వెలువరించడానికి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా, అవినీతికి తావు లేకుండా,రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా,అధికారం పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికార అరాచకాలకు సిద్ధపడకుండా కట్టు చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది.అదే సందర్భంలో సభలు నిర్వహించి పెద్ద మొత్తంలో మద్యం డబ్బు పంపిణీకి రాజకీయ పార్టీలు కుట్రలు పన్నే అవకాశం మెండుగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారాలను మరింత ఎక్కువగా వినియోగించుకొని సమర్థవంతంగా నిర్వహించడానికి పూనుకోవడం ద్వారా 1990-95 ప్రాంతంలో పనిచేసిన ప్రధాన కమిషనర్ టిఎన్ శేషన్ గుర్తుకు వచ్చేలా చురుకైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పైన ఉన్నది.మొక్కుబడి నిర్ణయాలు,చూసి చూడనట్లు వ్యవహరించడం,దొంగలను కాపాడడం ,అధికార పార్టీ పట్ల అనుకూల వైఖరిని ప్రదర్శించడం వంటి చర్యలకు తావు లేకుండా పనిచేస్తుందని ఆశిద్దాం.ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ప్రజలకు దక్కాల్సిన న్యాయమైన వాటా, అదే సందర్భంలో రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల సంఘం బాధ్యత కూడా ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన ప్రకటనలో ఉచితాలు నగదు చేరవేతను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టాలని ,రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణ కోసం చేసే ఖర్చు పైన నిఘా ఉంచాలని ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించిన అభిప్రాయం మాట వరసకు మాత్రమే కాకుండా అక్షరాలా 100% ఆచరణలో చూపించి తన నిబద్ధతను చిత్తశుద్ధిని చాటుకోవాలి.రాజ్యాంగబద్ధ సంస్థగా ఎన్నికల సంఘం యొక్క సమర్థతను ప్రతి పౌరుడు కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నందున విమర్శకు, వైఫల్యానికి ,లొసుగులకు,వివక్షతకు తావు లేకుండా నేరగాళ్లపై నేరాలపై ఉక్కు పాదం మోపడమే తన బాధ్యతగా గుర్తిస్తే ప్రస్తుత తరంతో పాటు రాబోయే తరాలు కూడా జ్ఞాపకం ఉంచుకునే అవకాశం ఉంటుంది.

ప్రకటనవేల పరిశీలన అంశాలు కొన్ని..

 

ప్రస్తుత అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు ఎందరో 2018 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల లో అనేక కాలమ్ లు పూర్తి చేయకుండా తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా హైకోర్టులో పెండింగ్లో ఉన్న విషయం కొందరి ఎన్నిక రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాలు మన ప్రజాస్వామిక వ్యవస్థకు,ఎన్నికల సంఘ అసమర్థతకు,రాజకీయ పార్టీల దిగజారుడుతనానికి కొలమానంగా భావించవచ్చు . ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక ప్రకటన చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతి కాలం ఇకపై తప్పనిసరిగా పూర్తి చేయాలని లేకుంటే ఆ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరిస్తామని చేసిన హెచ్చరిక అక్షరాల అమలు చేసి తీరాలి .లేకుంటే ప్రస్తుతం హైకోర్టులో ఉన్నటువంటి కేసులు మళ్లీమళ్లీ పునరావృతమైతే అప్పుడు న్యాయవ్యవస్థ,ఎన్నికల సంఘం, అధికారులు నేరస్తులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలను ప్రకటించుకొని కొనసాగిస్తే అభ్యంతరం లేదు కానీ ఒకవైపు ఎన్నికల సంఘం హెచ్చరించిన వెంటనే రాష్ట్ర ఆర్థిక మంత్రి పెన్షన్ల పెంపు,గ్యాస్ ధర తగ్గింపు పైన రేపో మాపో సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది.వాస్తవంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత మాత్రమే రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ప్రచారాన్ని నిర్వహించాలి కానీ గత ఆరు మాసాలుగా పార్టీలు మోసపూరిత వైఖరితో ప్రలోభాలు వాగ్దానాల పేరుతో ప్రజలను బానిసలుగా మార్చిన విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టిలో ఉంచుకోవాలి.ఈ సందర్భంలో ఇప్పటికే ఎన్నికల సమరానికి బిఆర్ఎస్ సిద్దమైనదని,కాంగ్రెస్ మాత్రం అస్త్ర సన్యాసం చేసిందని , బిజెపి పార్టీ కాడి పడేసిందని, కేవలం బారాస మాత్రమే సెంచరీ కొడుతుందని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా అనే జరుగుతాయని రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రకటించడం పార్టీ ప్రచారం లాగా కాకుండా ఇతర పార్టీల పైన అక్కసు వెళ్లబుచ్చుకున్నట్లు ఉన్నది ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే .ఇలాంటి అంశాల పైన ఎన్నికల సంఘం దృష్టి పెట్టి ఘర్షణలకు తావు లేకుండా కట్టడి చేయవలసిన అవసరం చాలా ఉన్నది.సంక్షేమ పథకాలను వేగవంతం చేసే బదులు కాలయాపన చేస్తూ అధికారులకు బదులు శాసనసభ్యులు నిర్ణయం తీసుకోవడం వంటి దుష్ట సంప్రదాయం కారణంగా లక్షలాది మంది గృహలక్ష్మి పథకానికి అర్హులు కాకుండా పోవడం జరిగింది . 4లక్షల మందిని ఎంపిక చేయాలని ఆలోచిస్తే 1,75,000 మందికి మాత్రమే మంజూరు పత్రాలు అందించినట్టు తెలుస్తుంటే ఇక మిగతా రెండు లక్షల 25 వేల మంది భవిష్యత్తు అగమ్య గోచరమే కదా! ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ప్రక్రియ పూర్తి కాకపోగా 2017, 21 వేతన సవరణలు పూర్తి చేయని కారణంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది . ప్రభుత్వం త్వర త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం గవర్నర్ ను బాధ్యురాలిని చేసి నిందించినప్పటికీ తప్పించుకునే ధోరణి కారణంగా ఆర్టీసీ వేతన సవరణ ఆశలు గల్లంతయినట్లుగా బాధ్యులు ఆరోపిస్తున్నారు. ఇక గత 17 రోజులుగా నిరవధిక సమ్మెను చేసి తమ కనీస హక్కుల కోసం పోరాడుతున్న ఆశ వర్కర్లు 9 అక్టోబర్ 2023 సోమవారం రోజున హైదరాబాదులోని కోటి ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైటాయించి ఆందోళన చేపట్టినప్పటికీ స్పందించని ప్రభుత్వం అంగన్వాడి, గ్రామపంచాయతీ కార్మికులు, సిపిఎస్ వంటి చిరు ఉద్యోగుల పైన నిర్లక్ష్యం వహించడం కూడా భవిష్యత్తు ఎన్నికల్లో బారాస పైన ప్రభావం పడే అవకాశం ఉన్నది.ఇప్పటికీ టికెట్ రాని సీనియర్ నాయకులకు , అధికార పార్టీలోకి వలస వస్తున్న వారికి నామినేటెడ్ పోస్టుల హామీ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.ఇది కూడా ఉల్లంఘనే. ఇలాంటి ప్రకటనల పట్ల నిఘా వేయవలసిన అవసరం ఎన్నికల సంఘానికి ఎక్కువగా ఉన్నది.ఇక నోటిఫికేషన్ విడుదలైన రోజుననే రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రిని ప్రస్తావిస్తూ రేపు మాపో పులి బయటకు వస్తుందని, ఇక తోడేళ్లన్ని తొర్ర లో కి వెళ్లాల్సిందేనని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడం పక్కా అని, 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలో చేసి చూపించామని, విపక్షాల హామీలకు ఆగం కావద్దని చేసిన ఎన్నికల ప్రకటన కూడా సాఫీగా సాగవలసిన ప్రజా రాజకీయాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నది . ఇలాంటి వందలాది సంఘటనలు అనునిత్యం జరుగుతూనే ఉంటాయి ఎన్నికల సంఘం కేవలం షెడ్యూల్ విడుదల చేసి నిరంతరం నిఘా వేయకుండా, క్షణక్షణానికి వారి మనుగడను ప్రశ్నించకుండా, పోనీలే అనే దాటవేత ధోరణి గనుక ప్రదర్శిస్తే కచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ వైఫల్యం పై ఎన్నికల సంఘం నిందను మూట కట్టుకోవలసి వస్తుంది. ఎందుకంటే అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రలోభాలు వాగ్దానాలు రెచ్చగొట్టే ప్రకటనలు డబ్బు సంచులను పంచడానికి సిద్ధంగా ఉన్న నిపుణులు అని తెలిసిన విషయమే.కనుక అలాంటి వారి పైన ఉక్కు పాదం మోపాలి అంటే ఎన్నికల సంఘం తన శక్తి యుక్తిని కూడగట్టుకుని,అధికార యంత్రాంగాన్ని పోలీసు బలగాలను గుప్పిట్లో పెట్టుకుని, ఎలాంటి వివక్షతకు తావు లేకుండా కొరడా ఝు లిపించాలి. దోషులని తేలితే వెంట వెంటనే చట్టం ముందు నిలబెట్టి కారాగారానికి పంపించాలి. ఆ రకమైన నిర్ణయం జరిగితే తప్ప ఎన్నికలలో సంస్కరణ ప్రక్షాళన సాధ్యం కాదు.ఇవాళ ప్రజలు రాజకీయ పార్టీలు బలవంతంగానో బుజ్జగించో ఇస్తున్నటువంటి మద్యం డబ్బుకు కొంతవరకు అలవాటు పడవచ్చు కానీ రాజకీయ పార్టీలు పంపిణీ చేయకుండా తమ సిద్ధాంతాన్ని ప్రచారం మాత్రమే చేసుకుంటే కచ్చితంగా ఓటర్లు కూడా మారుతారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏ రకంగానూ వెనుకడుగు వేయరు అనేది గతంలో జరిగిన సంఘటన ద్వారా మనం నిర్ధారణకు రావచ్చు.ఇప్పటికీ పెద్ద మనుషులు ఓటు వేయకపోతే చనిపోయిన వారితో సమానం అని అంటున్నారంటే వాళ్లు డబ్బు కోసం కాకుండా తమ మనుగడను అర్థం చేసుకున్నట్లే కదా ! ఇక ఈనెల 15వ తేదీ నుండి ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతూ రోజుకు రెండు మూడు బహిరంగ సభలను కవర్ చేయడానికి సిద్ధపడినట్లుగా ప్రకటన వెలువడితే, అంతే స్థాయిలో ప్రతిపక్షాలు కూడా విచ్చలవిడిగా బహిరంగ సభలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి.ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వ పక్షాన కాకుండా పార్టీ అధ్యక్షుల హోదాలో మాత్రమే ప్రభుత్వ వాహనాలను వినియోగించుకోకుండా అధికార యంత్రాంగం పోలీసు బలగాలకు పరిమితం చేస్తూ ప్రతిపక్షాల మాదిరిగానే ప్రచారం సాగించినట్లయితే అది నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది అనేది ప్రజలు ఆకాంక్షిస్తున్న ఒక వాదన .ఈ అంశాన్ని కూడా ఎన్నికల సంఘం పరిశీలించి అధికార వనరులను పరిమితం చేయడం ద్వారా కనీస రక్షణ బలగాలను మాత్రమే అనుమతిస్తూ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలి.ఎన్నికల ప్రక్షాళన,రాజకీయ పార్టీల ప్రక్షాళన,ప్రజలు ఓటర్ల మనస్తత్వ ప్రక్షాళన కూడా తెలంగాణ ఎన్నికల తోనే ప్రారంభం కావాలని కోరుకుందాం.అందుకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ…..

ముత్యాల రమేష్

అక్షిత జాతీయ దినపత్రిక స్టాప్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.

Breaking