డబ్బుల విషయమై అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్
వరంగల్,అక్షిత బ్యూరో :
సొంత అత్తమ్మను గన్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటన హన్మకొండలో సంచలనంగా మారింది. నిందితుడిని కానిస్టేబుల్ ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. మంచిర్యాలకు చెందిన ప్రసాద్ రామగుండం కమీషనరేట్ పరిధిలోని కొత్త కోట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతురాలిని కమలమ్మగా గుర్తించారు. కానిస్టేబుల్‌పై మృతురాలి కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా కానిస్టేబుల్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. రూ.4లక్షల విషయంలో అత్త అల్లుడి మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్నట్లు తెలిసింది. దీంతో గురువారం ఉదయం మంచిర్యాల నుంచి భార్య తో కలిసి గుండ్ల సింగారంనకు వచ్చిన ప్రసాద్.. అత్తతో మాట్లాడుతున్న క్రమంలో గన్‌తో ఛాతిలో కాల్పులు జరిపాడు. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పులు జరిపి అక్కడే నిలబడిన కానిస్టేబుల్‌పై మృతురాలి కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేశారు. దీంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.సంఘటనను పోలీసులు విచారణ చేస్తున్నారు.