IND Vs PAK : రఫ్పాడించిన రోహిత్‌.. పాకిస్తాన్‌పై అదే జైత్రయాత్ర..

  • పాక్‌పై భారత్‌ వరుసగా ఎనిమిదో విజయం
  • రఫ్పాడించిన రోహిత్‌
  • బౌలర్ల సూపర్‌ షో

 

ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌పై భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌ విభాగాల్లో రాణిస్తూ శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 దశాబ్దాలుగా దాయాది పాకిస్థాన్‌పై అదే ఆధిపత్యం. కోట్లాదిమంది భారతీయులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్‌ ఆశించిన రీతిలోనే ముగిసింది. వన్డే వరల్డ్‌క్‌పలో ఎన్నిసార్లు ఎదురొచ్చినా మిమ్మల్ని చిత్తు చేసేది మేమేనంటూ.. టీమిండియా ఈ వార్‌ను వన్‌సైడ్‌ చేసేసింది. ఎనిమిదికి ఎనిమిది విజయాలతో క్రీడాభిమానులను మురిపిస్తూ.. వీధుల్లో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడేలా చేసింది. అనిశ్చితికి మారుపేరైన పాక్‌ను బౌలర్లు తలా రెండేసి వికెట్లతో ఆడేసుకోగా.. అనంతరం హిట్‌మ్యాన్‌ రోహిత్‌ తన స్ట్రోక్‌ప్లే పవర్‌ ఏంటో చూపించాడు. 2019 టోర్నీ తరహాలోనే విరుచుకుపడి ఆరు సిక్సర్లతో పాక్‌ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇక శ్రేయాస్‌ అజేయ అర్ధసెంచరీతో ఈ ఏకపక్ష పోరును మరో 117 బాల్స్‌ ఉండగానే ముగించాడు. మరోవైపు లక్షా 30 వేల మంది సమక్షంలో మ్యాచ్‌ హోరాహోరీగా సాగకపోయినా పాక్‌పై భారత్‌ నుంచి అభిమానులకు ఇంతకంటే కావాల్సిందేముంటుంది!

అహ్మదాబాద్‌: ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌పై భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌ విభాగాల్లో రాణిస్తూ శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86) నుంచి మరో కీలక ఇన్నింగ్స్‌ రాగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ (62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. తాజా టోర్నీలో హ్యాట్రిక్‌ కొట్టిన భారత్‌ అటు పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. బాబర్‌ ఆజమ్‌ (50), రిజ్వాన్‌ (49), ఇమామ్‌ ఉల్‌ హక్‌ (36) మాత్రమే రాణించారు. బుమ్రా, హార్దిక్‌, కుల్దీప్‌, జడేజా, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్‌ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. షహీన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.

హిట్‌మ్యాన్‌ బాదుడు

192 పరుగుల స్వల్ప ఛేదనలో భారత్‌ ఏ దశలోనూ ఇబ్బందిపడలేదు. పాక్‌ బౌలర్లు పూర్తిగా గతి తప్పడంతో పరుగులకు లోటులేకుండా పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ తన భీకర ఫామ్‌తో విరుచుడుపడగా.. శ్రేయాస్‌ అర్ధసెంచరీతో తుదికంటా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ (16) స్వల్ప స్కోరుకే వెనుదిరిగి అభిమానులను కాస్త నిరాశపరిచాడు. ఆరంభంలో గిల్‌ చేసిన 16 పరుగులు ఫోర్ల రూపంలోనే వచ్చాయి. దీంతో అచ్చొచ్చిన మైదానంలో మరోసారి అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఖాయమనిపించింది. కానీ పేసర్‌ షహీన్‌ అతడిని బోల్తా కొట్టించడంతో మూడో ఓవర్‌లోనే జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. అటు రోహిత్‌ మాత్రం తనదైన శైలిలో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఏడో ఓవర్‌లో తన సిక్సర్‌, విరాట్‌ రెండు ఫోర్లతో 15 పరుగులు వచ్చాయి. తర్వాత 9వ ఓవర్‌లో రోహిత్‌ బాదిన రెండు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. పదో ఓవర్‌లో విరాట్‌ను హసన్‌ అలీ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రోహిత్‌కు శ్రేయాస్‌ జత కలిశాడు. కుదురుకునేందుకు శ్రేయాస్‌ కాస్త సమయం తీసుకున్నా రోహిత్‌ మాత్రం 36 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. 20వ ఓవర్‌లో రోహిత్‌ 4,6తో సెంచరీకి చేరువయ్యాడు. ఈ దశలో షహీన్‌ రెండో స్పెల్‌లో రోహిత్‌ను అవుట్‌ చేయడంతో పాక్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది. అప్పటికే మూడో వికెట్‌కు 77 పరుగులు జత చేరగా.. జట్టు విజయానికి మరో 36 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. చాలినన్ని ఓవర్లు ఉండడంతో శ్రేయాస్‌, రాహుల్‌ (19 నాటౌట్‌) సునాయాసంగా ఆడేస్తూ మ్యాచ్‌ను ముగించారు. చివర్లో ఫోర్‌తో విన్నింగ్‌ షాట్‌ బాదిన శ్రేయాస్‌ తన అర్ధసెంచరీని సైతం పూర్తి చేసుకున్నాడు.

స్కోరుబోర్డు:

పాకిస్థాన్‌: అబ్దుల్లా (ఎల్బీ) సిరాజ్‌ 20; ఇమామ్‌ ఉల్‌ హక్‌ (సి) రాహుల్‌ (బి) హార్దిక్‌ 36; బాబర్‌ (బి) సిరాజ్‌ 50; రిజ్వాన్‌ (బి) బుమ్రా 49; సౌద్‌ షకీల్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 6; ఇఫ్తికార్‌ (బి) కుల్దీప్‌ 4; షాదాబ్‌ (బి) బుమ్రా 2; నవాజ్‌ (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 4; హసన్‌ అలీ (సి) గిల్‌ (బి) జడేజా 12; షహీన్‌ (నాటౌట్‌) 2; హరీస్‌ (ఎల్బీ) జడేజా 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 42.5 ఓవర్లలో 191 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-41, 2-73, 3-155, 4-162, 5-166, 6-168, 7-171, 8-187, 9-187, 10-191. బౌలింగ్‌: బుమ్రా 7-1-19-2; సిరాజ్‌ 8-0-50-2; హార్దిక్‌ 6-0-34-2; కుల్దీప్‌ 10-0-35-2; జడేజా 9.5-0-38-2; శార్దూల్‌ 2-0-12-0.

భారత్‌: రోహిత్‌ (సి) ఇఫ్తికార్‌ (బి) షహీన్‌ 86; గిల్‌ (సి) షాదాబ్‌ (బి) షహీన్‌ 16; విరాట్‌ (సి) నవాజ్‌ (బి) హసన్‌ అలీ 16; శ్రేయాస్‌ (నాటౌట్‌) 53; రాహుల్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 30.3 ఓవర్లలో 192/3. వికెట్ల పతనం: 1-23, 2-79, 3-156. బౌలింగ్‌: షహీన్‌ 6-0-36-2; హసన్‌ 6-0-34-1; నవాజ్‌ 8.3-0-47-0; హరీస్‌ 6-0-43-0; షాదాబ్‌ 4-0-31-0.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking