కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ గల్లంతే

కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ గల్లంతే

– ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో గెలుపు మాదే

– జిల్లా మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు సరికాదు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాల సునామీలో బీఆర్ఎస్ గల్లంతు కాబోతోందని పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని సాయి గణేష్ నగర్ రోడ్ నంబర్ – 8లో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పాలేరు ఖమ్మం నియోజకవర్గాలతో పాటు మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని తెలిపారు.అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుని ప్రచారం చేస్తారని తెలిపారు. మొత్తం పది స్థానాల్లోనూ హస్తం హవానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక జిల్లా మంత్రి తీవ్ర వ్యాఖ్యలకు తెగబడుతున్నారని విమర్శించారు. బందిపోట్లు అనే పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని పట్టపగలు ప్రజల సమక్షంలో చేరికలు జరుగుతుంటే ఆయన అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. అహంకార తీరును తట్టుకోలేకనే రఘునాథపాలెం ఎంపీపీ భూక్య గౌరీ కాంగ్రెస్ గూటికి చేరారని మరింత మంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు రాబోతున్నారని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరు కూడా సరిగా లేదని విమర్శించారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్రనాయకులు జిల్లా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు ఇతర ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking