జర్నలిస్టు నర్సింగ్ రావు పాడె మోసిన మంద కృష్ణ మాదిగ
ముషీరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ పాత్రికేయులు ఎర్రం నర్సింగ్ రావు అకాల మరణం పట్ల ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కవాడిగూడలోని నివాసంలో నర్సింగ్ రావు భౌతిక కాయానికి మందకృష్ణ మాదిగ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ రావు సోమవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మంద కృష్ణ మాదిగ కవాడిగూడ దామోదరం సంజీవయ్య నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బన్సీలాల్‌పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగతో పాటు పలువురు రాజకీయ నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నర్సింగ్ రావు పాడె మోశారు. మంద కృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా గత 35 ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రతి ఒక్కరి ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్న గొప్ప మానవతావాది నర్సింగ్ రావు అని కొనియాడారు.
నర్సింగ్ రావుతో వ్యక్తిగతంగా మూడు దశాబ్దాలుగా అనుబంధం ఉన్నట్టు గుర్తు చేసుకున్నారు. వర్గీకరణ ఉద్యమంలో ఓ జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తగా ఎమ్మార్పీఎస్ కు అండగా నిలిచారని తెలిపారు.
ఆయన కుటుంబాన్ని మీడియా అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహ, బిజెపి నాయకులు పూస రాజు, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎం. అనిల్ కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాన్ గౌడ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి ఇ. చంద్రశేఖర్, మాదిగ జర్నలిస్టుల ఫోరం (ఎంజేఎఫ్) జాతీయ నాయకులు వంగూరి గోపాలరావు, రాష్ట్ర కోశాధికారి గజ్జల వీరేశం, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ నగర ప్రధాన కార్యదర్శి బి. జగదీశ్వర్, ఎంఆర్పిఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల రాజశేఖర్ మాదిగ ఎర్రం నర్సింగరావుకు ఘనంగా నివాళులర్పించారు.