పల్లెల్లో ప్రగతి పనుల పూర్తిపై దృష్టి సారించాలి

పల్లెల్లో ప్రగతి పనుల పూర్తిపై దృష్టి సారించాలి 
కలెక్టర్ హరి చందన
నల్గొండ, అక్షిత ప్రతినిధి :

మండల పరిషత్ అభివృద్ధి అధికారులు గ్రామాలలో తాగునీరు, పరిశుభ్రతతో పాటు, నిర్మాణ పనుల పూర్తి పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎంపీడీవోల సమీక్ష సమావేశానికి ఆమె హాజరయ్యారు. అంగన్వాడి కేంద్రాలలో నిర్మించనున్న టాయిలెట్లు, సిసి రోడ్లు, సబ్ సెంటర్ల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ,ఇంజనీరింగ్ అధికారులు సైతం త్వరితగతిన ఈ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఎంపీడీవోలు గ్రామాలలో తాగునీటి పరిస్థితిని విశ్లేషించాలని, ఏ గ్రామానికి ఎక్కడ నుండి తాగు నీరు వస్తున్నది, ఎంతవరకు వస్తున్నది అన్న విషయాలను తెలుసుకోవాలని, గ్రామీణ త్రాగునీటి సరఫరా పనులపై దృష్టి సారించాలన్నారు. గ్రామాలలో పరిశుభ్రత పై దృష్టి సారించాలని ,వేసవి దృష్ట్యా ఎక్కడ మొక్కలు ఎండిపోకుండా చూడాలని, ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ పనులపై దృష్టి సాధించాలని, సాధ్యమైనంత ఎక్కువగా పనులు గుర్తించాలని ఆదేశించారు.


ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఆయా మండలాల వారీగా చేతి వృత్తుల వారిని గుర్తించి లక్ష్యాన్ని నిర్దేశించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి నూటికి నూరు శాతం వీటిని పూర్తి చేసి తీరాలని ,అలాగే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పూర్తిపై దృష్టిసారించాలన్నారు. మంజూరు ఇచ్చిన సిసి రోడ్లన్నింటిని వెంటనే పూర్తిచేసేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రుణాల మంజూరు, ప్రధాన మంత్రి బీమా పథకం కింద అసంఘటిత కార్మికులందరూ నమోదయ్యేలా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని, గ్రామపంచాయతీ స్వీపర్లు ,ఉపాధి హామీ కూలీలందరిని నమోదు చేయాలని ఆదేశించారు.అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆయా అంశాల వారీగా ఎంపీడీవోలతో సమీక్షిస్తూ పనుల పూర్తికి సమయాన్ని నిర్దేశించారు.

ఈ సమావేశానికి జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండలరావు ఎల్డీఎం శ్రామిక్ తదితరులు హాజరయ్యారు

Leave A Reply

Your email address will not be published.

Breaking