మీ భవిష్యత్తు
మీ చేతుల్లోనే
కలెక్టర్ హరి చందన
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
“మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఓటు ద్వారా ఇచ్చిన అధికారంతోనే అన్ని నిర్ణయించబడతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు ఓటు వేయడమే కాకుండా సరైన నాయకున్ని ఎన్నుకోవాలి” అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన దాసరి కళాశాల విద్యార్థులకు పిలుపునిచ్చారు.
శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎన్నికల పై నిర్వహించిన స్వీప్ ఆవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కళాశాల విద్యార్థులకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మొదటిసారిగా వచ్చిన ఓటు హక్కు అనే అధికారం ద్వారానే నిత్యజీవితంలో అన్ని వస్తాయని ,దీనిని దృష్టిలో ఉంచుకొని ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాలని అన్నారు. మనం ఎన్నుకున్న పాలకుల ద్వారానే పరిపాలన జరుగుతుందని, అందువల్ల అందరూ ఓటు వేయాలని, సరైన వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ” అధికారం మీ చేతుల్లోనే ఉంది.ఓటు అనే అధికారం ద్వారానే వ్యవస్థ లో అన్ని నిర్ణయించబడుతాయి”. అని అన్నారు. ఒక్కోసారి ఒక్క ఓటుతో నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు.

విద్యార్థుల చదువు, లక్ష్యసాధనపై ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలని, ఎంతో మంది ఆటో డ్రైవర్ల పిల్లలు ,హమాలీ పని చేసే వారి పిల్లలు సైతం ఐఏఎస్ లు అయ్యారని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనం ఎన్నుకునే లీడర్ల ద్వారానే విద్య అవకాశాలు సైతం వస్తాయని, భవిష్యత్తును నిర్ణయించే ఓటును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత యువ ఓటర్ల పై ఉందని పునరుద్ఘాటించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పి సీఈవో ప్రేమ్ కిరణ్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్ ,స్వీప్ నోడల్ అధికారి అరుణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ స్వీప్ అవగాహన కార్యక్రమానికి హాజరైన విద్యార్థులచే ఓటు ప్రతిజ్ఞ చేయించారు.