ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు  బిగ్ షాక్

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు  బిగ్ షాక్

-ఇక గులాబీ నీడన నిలువలేం

-ఖమ్మంలో మూకుమ్మడిగా నేతల రాజీనామా బాట

-ఓటమి చెందినా తీరు మార్చుకోనందుకే

-పార్లమెంట్ ఎన్నికల ముంగిట భారీ కుదుపు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ కు బిగ్ షాక్ తగిలింది.పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు రాజీనామా బాట పట్టారు. సీనియర్ నాయకుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ నేతృత్వంలోని ఆయన మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు అగ్ర నేతల వ్యవహార శైలి కారణంగానే తాము పార్టీని వీడిపోతున్నట్లు నాయకులు ప్రకటించారు.కమ్మ రెడ్డి కాపు వైశ్య మాదిగ మాల తదితర అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓసీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ నాయకులు పార్టీని వీడారు. కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేసి భవిష్యత్ లో ఖమ్మం సమగ్రాభివృద్ధికి కృషి చేసే వారికే తమ మద్దతు ప్రకటించనున్నామని వెల్లడించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కారణాలివే…
ఎన్నో ఏళ్లుగా ఉద్యమ పార్టీగా ప్రజలకు పరిచయం ఉన్న టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పేరుతో బీఆర్ఎస్ గా మార్చిన కారణంగా పార్టీ ఉద్యమ స్వరూపం పూర్తిగా మారిపోయింది. జాతీయ పార్టీగా మార్పు చేసినప్పటికీ అందుకు తగిన కార్యాచరణను జాతీయ స్థాయిలో నిర్వహించలేకపోవడం వల్ల రాష్ట్రంలో పార్టీ పునాదులే దెబ్బతిన్నాయి. ఈ పరిణామంతో ప్రజల విశ్వాసం కోల్పోయాము. చివరికి వారి నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుని అధికారం కోల్పోయామన్నారు.ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజా సమస్యలను ఆకళింపు చేసుకోవడానికి వంద రోజుల గడువు ఇవ్వాలనేది మన పార్టీ సిద్ధాంతమే. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూడో రోజు నుంచే విమర్శించడం ప్రారంభించాము.ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమైన వ్యవహారంగా మేం భావిస్తున్నాము. దీని వల్ల ప్రజల్లో మన పార్టీ మరింత పలుచన అయింది. అలాగే ప్రజాస్వామ్యయుతంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్నెల్లలో కూలుస్తామని చేసిన వ్యాఖ్యలు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చర్యగా భావించక తప్పదు. నాడు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన అన్న ఎన్ఠీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన నాదెండ్ల భాస్కర్ రావు చరిత్ర హీనుడిగా మిగిలిన సందర్భాన్ని మర్చిపోయి ప్రవర్తించడం విచారకరం.కృష్ణా జలాలు ఖమ్మం జిల్లాతో పాటు పక్కనే ఉన్న నల్గొండ జిల్లా రైతుల పంట పొలాలకు ఎన్నో దశాబ్దాలుగా జీవం పోస్తున్నాయి. ఈ జలాల వినియోగం విషయంలో పక్క రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ ప్రయోజనాన్ని కాపాడేవిధంగా మీరు తీసుకున్న చర్యలు తెలంగాణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడానికి కారణమైంది. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మన పార్టీ కృష్ణా జలాల విషయంలో సరైన వైఖరిని అవలంభించకపోవడం శోచనీయమన్నారు.ఈ కారణాలతో పార్టీ జనంలో విమర్శల పాలవ్వడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అందువల్లే ఖమ్మం నగరంలో కీలక విభాగాల నాయకులుగా ఉన్న మేము పార్టీ సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము.అంటూ నాయకులు ప్రకటించారు.

ఎన్ఠీఆర్ ను విమర్శిస్తారా..?

బడుగు బలహీనుల అభివృద్ధి కాముకుడు నందమూరి తారక రామారావు.తాడిత పీడిత వర్గాల బాంధవుడు ఆయన రెండు రూపాయలకే కిలో బియ్యం చేతికిచ్చి ఆపన్నుల కడుపు నింపిన ఆపద్భాంధవుడు.మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనా వికేంద్రీకరణకు మూలాలు చూపిన సిసలైన పాలకుడు.ఇవన్నీ వెరసి కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో నిలుపుకున్న తెలుగు రాముడు నందమూరి తారక రామారావు.అలాంటి మహోన్నత వ్యక్తిని విమర్శిస్తారా..?అందరి బంధువైన ఆ మహానేతను అగౌరవ పరుస్తారా..?సినీ వినీలాకాశ వెండి తెరపై వెలుగులు చిమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసుకున్న ఎన్ఠీఆర్ ను అవమానించే సాహసం మీకెక్కడిది..?అలాగే ఆ మహానేత రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడుపైనా విమర్శనాస్త్రాలు సంధిస్తారా..? రాజకీయ కుట్రలతో 52 రోజుల పాటు జైలులో మగ్గించినా మచ్చలేని చంద్రుడిలా తిరిగొచ్చిన బాబునీ మీరు విమర్శిస్తారా..? అసలు ఆ ఇద్దరినీ విమర్శించే ముందు మీ స్థాయినీ, మీ స్తోమతను ఒక్కసారి వెనుదిరిగి చూసుకోరా..?”ఇది ఎవరి ఆవేదనో గ్రహించారా..? తెలుగు నేలకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్ఠీఆర్ ని విమర్శించిన తెలంగాణ తండ్రీ కొడుకులు కేసీఆర్ కేటీఆర్ లను ఉద్దేశించి గులాబీ పార్టీ నేతలే వెళ్లగక్కిన ఆక్రోశం ఇది. అలాగే నేటి తెలుగు తేజం చంద్రబాబును విమర్శించే నైతికత వారికెక్కడిదని ప్రశిస్తున్నారు.ఈ ఫలితంగానే తాము టీఆర్ఎస్ పార్టీలో ఇక ఇమడలేమని తెగేసి చెబుతున్నారు. గులాబీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాము ఎవరి ప్రలోభాలకో లొంగి గులాబీ గూడుని వీడటం లేదని కేసీఆర్ కేటీఆర్ లు తమ స్థాయికి మించి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నందుకే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఖమ్మం సమగ్రాభివృద్ధికి పాటు పడే వారికే తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

పులిపాటి నేతృత్వంలో…

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి అత్యంత సన్నిహితుడు ఆయన. చూడగానే పేరు పెట్టి పిలుస్తూ ఆప్యాయంగా సంభోధించే చనువున్న నాయకుడు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్ఠీఆర్ కి వెన్నంటే ఉండే అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర తెలుగు విద్యార్థి కన్వీనర్ గా ఖమ్మం జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్ గా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శిగా పని చేశారు. ఎన్ఠీఆర్ గండిపేటలో శిబిరం నడిపిన సమయంలో వ్యక్తిగత ఆంతరంగికుడిగా కూడా విధులు నిర్వర్తించారు. అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడికి కూడా వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారాయన. ఆ నేత మరెవరో కాదు.డాక్టర్ పులిపాటి ప్రసాద్. మహానేతల వద్ద కీలక పదవుల్లో ఒదిగి పని చేసి కూడా నేడు పదవులకు దూరంగా ఉంటూ గులాబీ పార్టీలో కొనసాగారు. నిన్న మొన్నటి వరకు ఎంతో వినమ్రంగా పార్టీలో పని చేసిన ఆయన తనకు రాజకీయ గురువైన ఎన్ఠీఆర్ ను గౌరవించని పార్టీలో మనుగడ సాగించడం కష్టమని నిర్ణయించుకున్నారు. దైవ సమానుడిలా పూజించిన ఎన్ఠీఆర్ ను అవమానించిన గులాబీ పార్టీని వీడటమే సరైన విధానమని తలచారు.టీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలిగేందుకు సిద్ధపడిన డాక్టర్ పులిపాటి ప్రసాద్ నిర్ణయానికి మద్దతు పలుకుతూ ఆయన మిత్ర బృందంలో మరో 3 వందల మంది గులాబీ పార్టీని వీడారు. రాజకీయ గురువుగా భావించి అభిమానించే మహానేత నందమూరిని కించపరిచే పార్టీలో ఇక ఇమడలేనని నిర్ణయించుకున్న పులిపాటి నిర్ణయానికి వెన్నుదన్నుగా నిలుస్తూ కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా 3 వందల మంది ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీని వీడారు.డాక్టర్ పులిపాటి ప్రసాద్ తో పాటు వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి మండదపు వెంకటేశ్వరరావు కంచర్ల దయాకర్ పీరునాయక్ సింగ్ శ్రీనివాసరావు మాసెట్టి వరప్రసాద్ రావు కాయల రాఘవయ్య గౌడ్ ఎండీ.ఖయూమ్ తొట్టి ఉపేందరమ్మ బండారి నాగేశ్వరరావు కుమ్మరి వెంకటేశ్వర్లు జమలాపురం రామకృష్ణ వల్లూరి తిరుపతిరావు పీరునాయక్ సింగ్ శ్రీనివాసరావు మాసెట్టి వరప్రసాద్ రావు కాయల రాఘవయ్య గౌడ్ ఎండీ.ఖయూమ్ తొట్టి ఉపేందరమ్మ బండారి నాగేశ్వరరావు కుమ్మరి వెంకటేశ్వర్లు జమలాపురం రామకృష్ణ గోళ్ళ రాధాకృష్ణ వరదా నర్సింహారావు తదితరులు బీఆర్ఎస్ పార్టీ వీడిన ప్రముఖుల్లో ఉన్నారు. ఈ పరిణామ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఈ ప్రభావం ఉండబోతుందన్న ప్రచారం సాగుతోంది.వంచనకు లోనై మనోభావాలు దెబ్బతీసుకొని తాము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేమని చెబుతున్న పులిపాటి ప్రసాద్ ప్రస్తుతానికి తాము ఎలాంటి రాజకీయ పార్టీని ఆశ్రయించబోమని స్పష్టం చేశారు. స్వతహాగా స్వయం కృషిని నమ్ముకున్న తనకు రాజకీయ పార్టీల అండదండలు అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో ఖమ్మం నగరంతో పాటు జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించే అభివృద్ధి కాముకులకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని డాక్టర్ పులిపాటి ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking