పల్లెల్లో పడకేసిన
పారిశుద్ధ్యం
– పట్టించుకోని అధికారులు, పంచాయతీ సిబ్బంది
–
– జ్వరాలతో అల్లాడుతున్న గ్రామీణులు
–
– మందు బిళ్లలతో సరిపెడుతున్న వైద్యసిబ్బంది
–
– ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్న రోగులు
–
-నకిలీ మెడికల్ షాపులను బంద్ చేయాలి
అక్షిత న్యూస్, మాడుగులపల్లి:
పారిశుధ్యం పల్లెల్లో పడకేసింది. పల్లెలు సీజనల్ వ్యాధులకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మరీముఖ్యంగా విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. మురికి గుంటలను దోమలు ఆవాసంగా చేసుకుంటున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు దోమల మోత మోగుతోంది. వాటి కాటు వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరాలతో గ్రామాలకు గ్రామాలే తల్లడిల్లుతున్నా, అధికారులకు మాత్రం ఏమీ పట్టడంలేదు. తూతూమంత్రంగా గ్రామాలను సందర్శిస్తూ తమ పని అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు. మాడుగులపల్లి, మండలంలో అన్నిగ్రామాలకు ప్రభుత్వ వైద్య సిబ్బంది సరిగా రావడం లేదు. ఒకవేళ వచ్చినా మందు బిళ్లలతో సరిపెడుతున్నారు.

దీంతో జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇందుగుల గ్రామం అంతా విష జ్వరాలతో బాధపడుతూ చికెన్ గున్యా అని ఆర్ఎంపీ వైద్యులు చెప్పి ఆ ట్రీట్మెంట్ ఆర్ఎంపీ వైద్యం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా కానీ వ్యాధి తగ్గకపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకుని మాడుగులపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలానే నకిలీ ఆర్ఎంపి వైద్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. మాడుగులపల్లి, కుక్కడం, బొమ్మకల్, తోపుచర్ల గ్రామాలలో మెడికల్ షాపులలో లైసెన్సులు లేకుండా వారి ఇష్టానుసారంగా వైద్యం చేస్తూ, మందులు అమ్మడం జరుగుతుందని పలుమార్లు పై అధికారులకు తెలియజేసిన కూడా లాభం లేకపోవడం ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఇలా ఉండగా రక్త పరీక్షలు చేస్తేనే ఏ వ్యాధి ఉందో తెలుస్తది అంటూ ఆర్ఎంపీలే రక్త పరీక్షలకు రాస్తూ మండల కేంద్రంలో ఉన్నటువంటి రెండు రక్త పరీక్ష కేంద్రాల్లో చేయిస్తూ వాటికి తగిన మందులు ఇవే అంటూ వారికి ఇష్టం వచ్చిన కంపెనీలు తక్కువ రేటుతో ఎంఆర్పి ఎక్కువ ఉండే మందులు ఇస్తూ వారి ఇష్టానుసారంగా రేట్లు వేస్తూ ప్రజల వద్ద నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇప్పటికైనా మండలంలో ఉన్నటువంటి మెడికల్ షాప్ లో నకిలీ ఆర్ఎంపీలను ఉన్నతాధికారులు గుర్తించి వారికి అర్హత ఉందో లేదో పర్మిషన్లు ఉన్నాయో లేవో చూసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.