పోరుబిడ్డకు…ఓరుగల్లు
ఎంపి బరిలో డా. రమేష్
కాంగ్రెస్ పెద్దల మదిలో డా. రమేష్
ఉద్యమాల ఉద్దండుడికి చోటు
సర్వేల్లోనూ ప్రధానంగా రమేష్ పేరు
టిక్కెట్ దక్కితే… విజయబావుటే
వరంగల్, అక్షిత బ్యూరో :
పోరాటాల పురిటిగడ్డ…ఓరుగల్లు… ఉద్యమాల కేంద్ర బింధువు. ఉద్యమాల ఖిల్లా.. ఓరుగల్లు ఖిల్లా. చారిత్రక సంపద, సౌభాగ్యం, ప్రాశస్త్యం, కళా సంపదతో తూలాడుతున్న మహా నగరం. నాడు కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా, కాకతీయులు నిర్మించిన స్మారక కట్టడాల్లో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలతో ప్రస్తుత నగరం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా నిలిచింది. కాకతీయ కళా తోరణం ప్రభుత్వ అధికారిక చిహ్నంలో చేర్చబడింది. అలాంటి చారిత్రాత్మకమైన… ప్రాశస్త్యమైన ఓరుగల్లు ప్రాంతానికి చెందిన బిడ్డ డా.బొంగు రమేష్ (బరిగెల)కు హస్తం వెన్నుదన్నుగా నిలవనుంది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల మదిలో ఉద్యమ వీరుడు… ఓ గౌరవ ప్రదమైన డాక్టర్ వృత్తి, స్థానికుడు, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డా రమేష్ ను వరంగల్ పార్లమెంట్ బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ పెద్దలు యోచిస్తుండ్రు.



అలుపెరుగని ఉద్యమనేత… నాడు తెలంగాణ ఉద్యమంలోనూ… నేడు వైద్య ఉద్యోగుల సమస్యల సాధనకు అవిశ్రాంత పోరు సలుపుతున్న బిడ్డ. విద్యార్థి దశ నుంచే లీడర్ లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఉద్దండుడు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకై గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగిన తెలంగాణ సంగ్రామంలో తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు వెన్నుదన్నుగా… అత్యంత సన్నిహితుడిగా…తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ జాక్ కు పురుడు పోసి ఉద్యమ కెరటంగా ప్రజ్వలించాడు. ఉద్యమం సాగిస్తున్న వైద్య ఉద్యోగులపై నాటి పాలకులు ఉక్కుపాదం మోపినప్పటికి తమదైన శైలిలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా జవసత్వాలు ఉదాడు. దీక్షలు సాగించి సకల జనుల సమ్మె, సాగర హారం తదితర అన్నీ ఉద్యమాలకు డాక్టర్స్ జాక్ చైర్మన్ గా నడుంబిగించారు.

ఎన్నో ఆత్మబలిదానాలు… పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణలో గత పదేళ్లుగా సీఎం కుర్చీలో తిష్ట వేసుకుని ఆసీనులైన కేసీఆర్ ఉద్యమ వీరులను పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులను అందలమెక్కించిన విషయం జగద్విదితమే. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి క్రియాశీలక భూమిక పోషించిన తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ జాక్ చైర్మన్ రఘు, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ జాక్ చైర్మన్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డా. బొంగు రమేష్ (బరిగెల) తదితర నేత ఉద్యమాలకు ఊపిరి నిచ్చి అలు పెరుగని పోరు సాగించారు.

రాజకీయ సంగ్రామం ఓ వైపు అధికారిక గణం మరోవైపు …అంతా సమ్మిళితమై తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా నీళ్ళు నిధులు,నియామకాలకై సాగించిన మహోజ్విలితమైన ఉద్యమ సంగ్రామ చరిత్ర టాప్ టెన్ లో తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ జాక్ చైర్మన్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డా. బొంగు రమేష్ (బరిగెల) క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి చారిత్రాత్మకమైన ఉద్దండులను సైతం కేసీఆర్ చేసిన నయవంచన సమిధలో బలైన వారిలో డా. రమేష్ కూడా ఉన్నారు. నాడు కేసీఆర్, కవిత, హరీష్ రావు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికి…తెలంగాణ సిద్దించాక..కేసీఆర్ పదేళ్ల పాలనలో డా. రమేష్ కు ఎలాంటి ప్రాతినిధ్యం లభించని పరిస్థితి.

అయినప్పటికీ ఉద్యమ లక్షణాలను పుణికి పుచ్చుకున్న డా.రమేష్ నాటి ఉద్యమ ప్రస్థానం తీరులానే కేసీఆర్ పదేళ్ల పాలనలోనూ వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు తోడు, చారిత్రాత్మకమైన ఉస్మానియా ఆసుపత్రి … చిక్కి శల్యమై… శిధిలావస్థకు చేరి… పెచ్చులూడి… చికిత్సకు వచ్చిన పేద రోగులపై పడి ప్రమాదాలకు గురైన పరిస్థితుల్లో కేసీఆర్ సర్కార్ పై డా.రమేష్ యుద్ధ భేరి మోగించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నాటి వైద్య మంత్రి ఈటెల రాజేందర్ లతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దిన్ ఓవైసీలను కూడా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ధర్నాలు, ర్యాలీలు సాగించి ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితిపై వైద్య ఉద్యోగులందరిని జాగృతం చేసి అవిశ్రాంత పోరు సాగించారు.

డా.రమేష్ పోరాటాల ఫలితంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. అయినప్పటికీ ఆసుపత్రి భవంతి నిర్మాణాన్ని ఇదిగో అదిగో అంటూ కేసీఆర్ కాలయాపన చేశారు. నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ కు ప్రజలు చరమగీతం పలికి కాంగ్రెస్ సర్కార్ కు పట్టం కట్టారు. ఇక తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి చరిష్మాకు కాంగ్రెస్ హస్తిన పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ లో ఉద్యమ వీరులకు కాసింత ఉపశమనం లభిస్తుంది. కేసీఆర్ తీరుతో ఎలాంటి ప్రాతినిధ్యం… పదవులకు నోచుకోని వాళ్ళను హస్తం అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. తెలంగాణ జెఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో ఎంఎల్ సీని చేసి పెద్దల సభకు పంపించారు. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ క్రియాశీలక భూమికగా కోదండరాం వ్యవహరించనున్నారు. దీంతో నాటి తెలంగాణ సాధనకు పోరు సాగించినోళ్లకు సైతం కాసింత ఆదరణ లభించనుందన్న విశ్వాసం వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన వరంగల్ పార్లమెంట్ బరిలో అదే జిల్లాకు చెందిన పరకాల నియోజకవర్గ పరిధిలోని వెల్లంపల్లికి చెందిన బొంగు డా రమేష్ ( బరిగెల) సైతం కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశించి దరఖాస్తును సమర్పించిన విషయం విదితమే. ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదరం రాజనర్సింహ, కొండా సురేఖ తదితరులను కలిసి తమ అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా అభ్యర్థించారు. హస్తిన పెద్దలను సైతం కలిసి తమకు వరంగల్ పార్లమెంట్ టిక్కెట్ కేటాయించాల్సిందిగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ ఉద్యమ చరిత్ర, ఓ డాక్టర్ గా పేదలకు అందించిన సేవలు, వైద్య ఉద్యోగుల సమస్యల సాధనకు సాగించిన కృషికి తోడుగా మాదిగ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్, స్థానికత, ఆర్థిక, అంగ బలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని డా.రమేష్ పేరును ఖరారు చేసేందుకు అధిష్టానం పరిశీలిస్తుంది. వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో వరంగల్ పార్లమెంట్ విస్తరించి ఉంది.

ఆయా నియోజకవర్గాల్లోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయా ఎమ్మెల్యేలతోనూ వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్నివర్గాల ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలు డా. రమేష్ కు కలిసి వస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావులను కలిసి తమకు అనుకులంగా వ్యవహరించాలని అభ్యర్థించారు.

ప్రజాప్రతినిధులు, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కల్గి ఉండడంతో కాంగ్రెస్ చేపట్టిన పలు సర్వేల్లోనూ డా. రమేష్ పేరు పతాక స్థాయిలోనే ఉన్నట్లు సమాచారం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎవరికి చోటిస్తారో! చూడాల్సిందే.
బాల్యం…చదువు
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని వెల్లoపల్లికి చెందిన బరిగెల ఉప్పలయ్య – లక్ష్మి దంపతుల పుత్రుడు డా.రమేష్. స్వంత ఇంట్లోనే తల్లి తండ్రులు, బ్రదర్, సిస్టర్ లతో కలిసి నివాసం ఉంటున్నారు. వృత్తి రీత్యా డా. రమేష్ హైదరాబాద్, వరంగల్ కు రాకపోకలు సాగిస్తున్నారు. డా.రమేష్ భార్య డా. హిమబిందు గైనకాలజిస్ట్, కుమారుడు నిషాంత్ వైద్య విద్యను అభ్యశిస్తుండగా కుమార్తె శ్రేష్ఠ
చదువుతుంది. వెల్లoపల్లిలోనే ప్రాథమికోన్నత విద్య 1 నుంచి 7 వ తరగతి వరకు, 8 నుంచి 10 వరకు జడ్ పి ఉన్నత పాఠశాల, నడికుడ, హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కాకతీయ యూనివర్సిటీలో ఏడాది బీ ఫార్మసీ, ఆ తదుపరి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి గాంధీ మెడికల్ కళాశాలలో ఎంఎస్ పూర్తి చేశారు. జాఫర్ ఘడ్, స్టేషన్ ఘన్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1998 నుంచి 2002 వరకు విధులు నిర్వర్తించారు. ఆ తదుపరి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, పదోన్నతి పొంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లోనే ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

హైదరాబాద్ లో స్వంతంగా 100 పడకల ఆసుపత్రి సతీమణి డా. హిమ బిందు గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో సాగుతుంది.
విద్యార్థి దశ నుంచే లీడర్
కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యనభ్యసించే కాలంలోనే స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ, 2003 నుంచి 2006 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా, ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ, ఏపిజీడిఏ జాయింట్ సెక్రటరీ, వరంగల్, 2010 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఫౌండర్, రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో మెడికల్ జేఏసీ ఛైర్మన్ గా క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ల వద్ద తెలంగాణ ఆవశ్యకతను వివరించే బృందంలోనూ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి హాజరయ్యారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ చొరవ తో ఎట్టకేలకు సిద్ధించిన తెలంగాణలో పదేళ్లుగా కొనసాగిన తొలి తెలంగాణకు కేసీఆర్ సీఎంగా వ్యవహరించి తెలంగాణ ఉద్యమ కారులను అటుంచి పక్త్ రాజకీయం అంటూ తెలంగాణ ద్రోహులకు ప్రాతినిధ్యం… పదవులు కట్టబెట్టారు. నాటి నుంచి పదేళ్లుగా మరో పోరాట పంథాను ఎంచుకుని వైద్య ఉద్యోగుల సమస్యల సాధనకు, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవంతికై కేసీఆర్ సర్కార్ పై ఉద్యమం సాగించి డా.రమేష్ చరిత్రను సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే…సామాజిక సమీకరణల్లోనూ ఎస్సీ మాదిగ కులానికి చెందిన డా. రమేష్ కు టిక్కెట్ కేటాయిస్తే ఇక కాంగ్రెస్ విజయ బావుటాను ఎగుర వేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా భావించే పార్లమెంట్ ఎన్నికలను అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు మొదలెట్టింది. సమగ్రమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టారు. నాటి ఉద్యమ రథసారథి, ప్రస్తుత ఎంఎల్ సీ, కాంగ్రెస్ సర్కార్ లో క్రియాశీలక భూమిక పోషించనున్న ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి సాగించిన పోరుబిడ్డ డా.రమేష్ కు వరంగల్ ఎంపి టిక్కెట్ దక్కేనా? కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో? ఎలాంటి సమీకరణలకు చోటిస్తారో?వేచి చూడాల్సిందే.