బీబీ పాటిల్ వెంట నడిచేదెవరూ..*

*బీబీ పాటిల్ వెంట నడిచేదెవరూ..*

బిఆర్ఎస్ నుండి బిజేపిలో చేరిన 24 గంటలోనే టికేట్ కెటాయింపు..

– కొంతకాలంగా బిజెపి ని అంటిపెట్టుకొని ఉన్నవారి ఆశలు గల్లంతు..

పాటిల్ కు టికెట్ కెటాయింపుపై బిజేపిలో భగ్గుమంటున్న అగ్రజ్వాలలు

– బిఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి బిజేపిలోకి ఆహ్వానిస్తున్న బీబీ పాటిల్..

అందోలు, అక్షిత ప్రతినిధి :
జహీరాబాద్ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ అనూహ్యంగా బిఆర్ఎస్ పార్టీని వీడి బిజేపిలో చేరి బిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వడంతో పాటు జహిరాబాద్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న బిజేపి నేతలకు కూడా ఝలక్ ఇచ్చాడు. బిజేపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చూగ్ సమక్షంలో పార్టీలో చేరిన 24 గంటలోనే బీబీ పాటిల్ కు టికెట్ కెటాయించడంతో ఒక్కసారిగా స్థానికంగా బిజేపి క్యాడర్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బీబీ పాటిల్ సైతం టికెట్ కెటాయించిన వెంటనే మద్దతుదారులను కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించాడు. బీబీ పాటిల్ జహీరాబాద్ లోక్ సభ స్థానం నుండి 2014, 2019 వరుస పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఎంపీగాపనిచేయడంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ నాయకులతో సన్నిహిత సంబందాలు ఏర్పడడంతో వారి మద్దతును కోరడంతో పాటు పార్టీ మార్పు ద్వారా బిజేపిలోకి తీసుకువచ్చేందుకు తన అనుచరులతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నారు. పదేళ్లు పాటిల్ తో కలిసి పనిచేసిన ద్వితీయ శ్రేణి బిఆర్ఎస్ నాయకులు కొందరూ బిఆర్ఎస్ పార్టీలో ఉండాలా..?బిజేపిలో చేరాలా..? అనే ఆలోచనలో పడ్డారు. బీబీ పాటిల్ స్వంత అసెంబ్లీ నియోజకవర్గమైన జుక్కల్ నుంచి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు పార్టీని వీడనున్నట్లు ప్రచారం సాగుతోంది.

*- స్వంతపార్టీనేతల సహకారం అందేనా..?*

జహీరాబాద్ లోక్ సభ నుండి పోటీచేసేందుకు బిజేపి పార్టీ తరపున అరడజన్ మంది ఆశలు పెట్టుకొని కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తు వచ్చారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఎవరికివారుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు విశ్వప్రయత్నాలు సాగించారు. తనకే టికెట్ అంటూ వారి అనుచరుల దగ్గర చెప్పుకుంటూ ఎవరికి వారుగా ప్రచారం చేసుకున్నారు. జహీరాబాద్ లోక్సభ బిజేపి అభ్యర్ధిగా తానే బరిలో ఉంటున్నాననే సందేశం ప్రజలకు చేరవేసేలా పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పోస్టర్లను అతికించేశారు. మాజీ కేంద్ర మంత్రి ఆతే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్, మాజీ ఎంపీ కుమారుడు జైపాల్ రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, పైళ్ల క్రిష్ణారెడ్డి, సురేష్ రెడ్డి తో పాటు మరో ముగ్గురు నేతలు టికెట్ను ఆశించారు. ఇంతలోనే బీబీ పాటిల్ బిఆర్ఎస్ పార్టీని వీడి బిజేపిలో చేరడం, ఆయనకే టికెట్ కెటాయించడం ఒక్కరోజులోనే జరిగిపోయింది. దీంతో జహీరాబాద్ లోక్ సభ టికెట్ఆశిస్తున్న నేతల ఆశలు గల్లంతవడంతో వారు నిరూత్సాహానికి గురిచేసింది. వారు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి బీబీ పాటిల్ కు ఏ మేరకు సహాకరిస్తారు.. లేక సైలెంట్ గా ఉండిపోతారా..? పార్టీ మారుతారా అనేది వేచి చూడాల్సిందే.

*- లోక్ సభ పరిధిలో ఒకే అసెంబ్లీ స్థానంలో బిజేపి గెలుపు..*

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జహీరాబాద్, బాన్సువాడ, కాంగ్రేస్ అందోలు, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో బిజేపి అభ్యర్థిగా పోటీచేసిన వెంకటరమణరెడ్డి గెలుపొందాడు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రేస్ పార్టీయే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ 4,34244 ఓట్లతో మొదటి స్థానంలో, కాంగ్రేస్ అభ్యర్థి మదన్మోహన్ రావు 4,28015 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచాడు. బిజేపి అభ్యర్థిగా బండారు లక్ష్మారెడ్డి 1,38947 ఓట్లను సాధించి మూడో స్థానానికి పరమితమాయ్యడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రేస్ పార్టీకి 5,48,348 ఓట్లు,బిఆర్ఎస్ కు 5,30,194 ఓట్లు , బిజెపి కి 1,72,575 ఓట్లు వచ్చాయి.

*పాటిల్ పార్టీ మార్పకు కారణమేంటి..?*
బీబీ పాటిల్ మొదటి నుండి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అడుగు జాడల్లో నడుస్తూ విదేయుడిగా పేరుతెచ్చుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ సమావేశాల్లో పాల్గొని బిజేపిపై అనేకమార్లు విమర్శలు గుప్పించిన పాటిల్ అదే పార్టీలో చేరడంపై అందరూ చర్చించుకుంటున్నారు. అసెంబ్లీఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది అధికారాన్ని కోల్పోవడంతో బీబీ పాటిల్ పార్టీ మారినట్లుగా ఒకవైపు ప్రచారం సాగుతుండగా, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బిఆర్ఎస్ అగ్రనాయకులు పార్లమెంట్ ఎన్నికల్లో మీ గెలుపుకొరకు పనిచేయాలంటే మేము అడిగినంత మాకు ముట్టజెప్పాలని డిమాండ్ చేయడం బీబీ పాటిల్ పార్టీ మారేందుకు ఒకింత కారణమణే షికార్లు పుకార్లు మరోవైపు వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking