జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ముందడుగు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముందడుగు పడింది.దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉండటంతో మీడియా అకాడమీ ఆ దిశలో దృష్టి సారించింది.తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై సమీక్షా సమావేశం జరిగింది.ఇళ్ల స్థలాల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై మీడియా అకాడమీ చైర్మన్ పలు సూచనలు చేశారు.
ఈ సమావేశానికి వివిధ హౌజింగ్ సొసైటీల ప్రతినిధులను ఆహ్వానించారు.సొసైటీల వారిగా ఆయా ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించారు.దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ మీటింగులో అనేక అంశాలు చర్చకు వచ్చాయి.ప్రభుత్వంలోని పెద్దలను సంప్రదించడానికి అన్ని సొసైటీలు ఒక్క తాటి మీదకు రావలసిన ఆవశ్యకతపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ,ది హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, దక్కన్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ల మధ్య సమన్వయం కోసం ఒక కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.ఆ మేరకు ఒక్కో సొసైటీ నుంచి ముగ్గురి చొప్పున సమన్వయ కమిటీకి ప్రాతినిధ్యం వహించేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పెద్దల దగ్గర త్వరలోనే ఒక హై లెవెల్ మీటింగు ఉండే అవకాశాలున్నందున రిపిటేషన్ లేకుండా అన్ని సొసైటీలు, వీలైనంత త్వరగా జాబితాలను సిద్దం చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న 3 సొసైటీల్లో దాదాపు అందరు జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారనీ, వీటన్నిటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వాటిని ఏకీకృతం చేయాలని సమావేశం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో మార్చి 7 వ తేదీన నిర్వహించిన సమావేశంలో టీయూడబ్ల్యూజే [ఐజేయూ] రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ,ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి,టీ శాట్ సీఈఓ బొదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,తెలంగాణ మ్యాగజైన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కే.శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ తరఫున సూరజ్ కుమార్, బందు శ్రీకాంత్,రాకేష్ రెడ్డి,అజయ్ కుమార్,ది హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ నుంచి రవీంద్ర బాబు మిక్కిలినేని,భూపాల్ రెడ్డి,భీమగాని మహేశ్వర్, సునీత, దక్కన్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ప్రతినిధులుగా రామకృష్ణ, శ్రీనివాస్,విక్రం రెడ్డి హాజరయ్యారు.
JNJHS సభ్యులకు 70 ఎకరాల భూమి స్వాధీనం చేయాలని సుప్రీంకోర్టు 2022 లోనే తీర్పు ఇచ్చినందున,ఆ తీర్పును అమలు చేయడంలో ఉన్న అవరోధాలను అధ్యయనం చేయాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తెలుస్తోంది.అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నందున అందరికీ ఆమోదయోగ్యమైన ‘ వర్కింగ్ ప్లాన్ రూపొందించాలని సీఎం ఆదేశించారు.