రూ.326 కోట్లతో నల్గొండ ప్రగతి

రూ.326 కోట్లతో
నల్గొండ ప్రగతి

పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నల్గొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.శుక్రవారం అయన మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ సమీపంలోని ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నల్గొండ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు వెనక పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు.
నల్గొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నల్గొండ చుట్టూ 700 కోట్ల రూపాయల వ్యయంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి వచ్చే నెలలోనే టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. ముషంపల్లి డబల్ రోడ్డుకు 100 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించామని, యువతకు ఉపాధి కల్పనలో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 6000 మంది విద్యార్థులతో జాబ్ మేళ నిర్వహించామన్నారు.

రాబోయే రెండు నెలల్లో మరొక జాబ్ మేళా నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఎస్ ఎల్ బి సి కాల్వ లైనింగ్ పనులను చేస్తున్నామని, సొరంగ మార్గం పనులు పూర్తి చేయడానికి నిధులను మంజూరు చేయించామని, త్వరలోనే ఆ పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు. నల్గొండ పట్టణంలోని ప్రతిక్ రెడ్డి జూనియర్ కళాశాల వద్ద జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపేదలకు సబ్సిడీ భోజన పథకం అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిరుపేదలకు సబ్సిడీ భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking