మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నానా కష్టాలు పడి యాసంగి పంట రైతన్న పండించుకుంటే రైస్ మిల్లర్స్ చేతిలో నష్టపోతున్నారు. మిర్యాలగూడ డివిజన్ లోని చెరువులు, బోరు బావుల కింద రైతులు ఎదో వరి పండించుకుని చాలీ చాలని దిగుబడితో గట్టేక్కారు. మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం, గూడూరు, సాగర్ రోడ్డు, వేములపల్లి మండలం శెట్టిపాలెంలోని రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరారు. పండించిన దాన్యం అమ్ముకునేందుకు రైస్ మిల్లుల వద్దకు వెళితే వారి ఇష్టారాజ్యంగా దాన్యం ధర చెబుతున్నారు. మొన్న, నిన్న ఉన్న ధర నేడు లేదు. రైతు పండించిన చింట్లు జెఎస్ఆర్ దాన్యం ధర మొన్న క్వింటాలు ధర రూ.2,700, నిన్న రూ.2,600లు పలకగా ఆదివారం రూ.2,500లు ఉంది. హార్వెస్టర్ తో దాన్యం నుర్పిడి చేసి పచ్చిగా, తేమ ఎక్కువగా ఉండటంతో మిల్లర్ చెప్పిన ధరకు రైతు విక్రయస్తూ నష్టపోతున్నాడు. ధాన్యం అమ్మిన డబ్బలు చెల్లింపు లేదు. 20, 30 రోజుల గడువు పెడ్తున్నారు. గడువు లోపు చెల్లిస్తారనే నమ్మకం తక్కువ. రైస్ మిల్లుల వద్ద రైతులు బారులు తీరుతుండటంతో వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు.ఆరుగాలం కష్టపడ్డ రైతులకు ధర గిట్టుబాటు కావడం లేదని రైస్ మిల్లర్స్ ను రైతులను ప్రభుత్వం సమన్వయ పర్చాలని గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డిగూడెం రైతు గజ్జెల నర్సిరెడ్డి కోరారు.