హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
“యాదగిరిగుట్ట పులిహోర ప్రసాదంలో ఎలుక ” అని వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్త నిరాదారమైనదని అందులో వాస్తవం లేదని దేవాదాయ శాఖ కమీషనర్ హనుమంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ దిన పత్రికలలో ప్రచురితమైన వార్తపై దేవాదాయ శాఖ అదనపు కమీషనర్ శ్రీమతి యం.యం.డి. కృష్ణవేణి శనివారం యాదగిరిగుట్ట దేవస్థానం సందర్శించి విచారణ చేశారు. కేవలం సోషల్ మీడియాలో పోస్టుయైన వార్త మేరకు కొన్ని దినపత్రికలు ఆ వార్తను ప్రచురించాయని విచారణలో తేలింది. స్థానిక ప్రతికా విలేకరులను కూడా అదనపు కమీషనర్ విచారించగా అలాంటి వార్తలు వారి దృష్టిలో కూడా రాలేదని తెలిసింది. కేవలం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంత మంది ప్రయత్నించారని తెలిసింది. భక్తులు ఎవరు కూడా ఈ విషయమై యాదగిరిగుట్ట దేవస్థానము అధికారులకు ఫిర్యాదు చేయలేదని విచారణలో తెలిసింది. దేవస్థానం ప్రసాదాల తయారిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని కమీషనర్ హనుమంత రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.