మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు
హోళీ శుభాకాంక్షలు
* అందరి జీవితాల్లో నిత్య వసంతం వెల్లివిరియాలి
మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో నిత్య వసంతం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురుతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సంప్రదాయం రమణీయమైనదని తెలిపారు. హోళీ నేపథ్యంలో పల్లెల్లో వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటాపాటలతో, కోలాటాల చప్పుళ్లతో ఉత్తేజం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా సింగిడి రంగుల నడుమ కేరింతలతో సాగే హోలీ.. మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను, ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని అందిస్తుందని తెలిపారు. భేదభావాలను వీడి పరస్పర ప్రేమ, అభిమానాలను చాటుకొంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని భాస్కర్ రావు కోరారు.