ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటేయండి
మీ భవిష్యత్తు బాగుకై
మంచి నాయకున్ని ఎన్నుకోండి
జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పిలుపు
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే అని, కుల, మత, లింగభేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకున్ని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. పలాన వారికి వేయాలని ఎవరో చెప్తే మీరు ఓటు వేయొద్దని, మీ ఆత్మ సాక్షిగా నైతిక ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.మంగళవారం ఆమె ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలో నైతిక ఓటింగ్ పై నాగార్జున కళాశాల మైదానం నుండి స్థానిక గడియారం సెంటర్ వరకు నిర్వహించిన 5 కే రన్ ను జండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆమె స్థానిక గడియారం సెంటర్లో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఈ ఎన్నికలలో 85 సంవత్సరాలు నిండిన ఓటర్లకు, దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని, హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్- 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, లేదా సాక్ష్యం యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, పంచాయతీ సెక్రటరీలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, పోలీసులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్న ఈ 5 కే రన్ కు అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ పుల్లారావు, డిఎస్ డిఓ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.