గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా
ఏర్పాట్లు చేయాలి

ఖమ్మం/అక్షిత బ్యూరో :

గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణకు కావలసిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పోలీసు సూపరింటెండెంట్లకు సూచించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు పోలీసు సూపరింటెండెంట్లతో వచ్చే జూన్ 9 వ తేదీన నిర్వహించబడే టిజిపిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్షకు చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి జిల్లాకు పరీక్షల నిర్వహణకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ ను నియమించడం జరిగిందని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు రీజనల్ కోఆర్డినేటరులు జాయింట్ కస్టోడియన్ గా ఉంటారని వీరికి పోలీసు నోడల్ అధికారి సహకరిస్తారని ఆయన అన్నారు. ప్రతి సెంటకు ఒక డిపార్టుమెంటల్ అధికారిని నియమించాలని తహశీల్దార్ స్థాయి అధికారిని ఫ్లయింగ్ స్క్వాడ్ గా ప్రతి వంద మంది అభ్యర్ధులకు ఒక ఐడెంటిఫికేషన్ అధికారిని నియమించాలని ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేయాలని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాలకు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు గాడ్జెట్స్ సెల్ ఫోన్స్ వెంట తీసుకు రాకుండా తనిఖీలు నిర్వహించాలని పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని పరీక్ష రోజున విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఎమర్జెన్సీ మందుల ఏర్పాట్లతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాల ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రాలలో నిబంధనల మేరకు బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని పరీక్ష రోజు 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్ని జిరాక్సు షాపులు బంద్ చేసి ఉండేలా చర్యలు తీసుకోవాలని పరీక్ష రోజు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థుల కోసం అదనంగా, ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని పరీక్షకు రెండు రోజుల ముందే కేంద్రాలు పరిశుభ్రంగా వుండేలా పారిశుధ్య చర్యలు పూర్తి చేయాలని అన్నారు. త్రాగునీటి సౌకర్యం కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని పరీక్ష మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్షా కేంద్రాలకు పరీక్ష అనంతరం స్ట్రాంగ్ రూముకు రవాణా ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని వాహనాల కండీషన్ పూర్తి సామర్థ్యంతో ఉండేలా చూడాలని ట్రాఫిక్ పైలట్ ఏర్పాటుతో రవాణా సాఫీగా అయ్యేలా పోలీసు శాఖ పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. దివ్యాంగ అభ్యర్ధుల కోసం గ్రౌండ్ ఫ్లోర్ లోనే పరీక్షా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని దివ్యాంగులకు నిబంధనల ప్రకారం అర్పులైన స్క్రైబ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్ధులకు బయోమెట్రిక్ నిర్వహణ ఉంటుందని సిబ్బందికి బయోమెట్రిక్ తీసుకునే విధానంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో రెండు రోజుల ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. రీజనల్ కోఆర్డినేటర్లకు సెంటర్ అబ్జర్వర్లకు డిపార్టుమెంట్ ఆఫీసర్లకు పోలీస్ నోడల్ అధికారులకు ఈనెల 22 వ తేదీన హైదరాబాదు కూకట్ పల్లి జేఎన్టీయూ కాంప్లెక్స్ లోని యుజిసి ఆడిటోరియంలో బయోమెట్రిక్ విధానంపై శిక్షణ అందిస్తామని ఆయన తెలిపారు. జూన్ 9 వ తేదీన ఉదయం 10-30 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులను బయోమెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 9-00 గంటల నుండే కేంద్రాలలోనికి అనుమతించడం జరుగుతుందని 10=00 గంటలకు గేట్లు మూసివేయాలని ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించడం కుదరదని ఆయన అన్నారు. అభ్యర్ధులు తమ వెంట హాల్ టిక్కెట్ తో పాటు ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకురావాలని చైర్మన్ అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 18600 మంది అభ్యర్థుల కోసం 52 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు లైజన్ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించినట్లు బయోమెట్రిక్ యంత్రాలు 1 రోజు ముందు జిల్లాకు వస్తే పరీక్షించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్ డి మధుసూదన్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి మాలతీ జిల్లా రవాణా శాఖ అధికారిణి అఫ్రిన్ సిద్దిఖి జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ విజయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. జాన్ బాబు ఎస్బిఐటి ప్రిన్సిపాల్ డి. రాజకుమార్ ట్రాన్స్కో డిఇ బాబురావు ఆర్టిసి డిపో మేనేజర్ శ్రీనివాస్ కలెక్టరేట్ ఎ ఓ అరుణ సహాయ కోశాధికారి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking