కౌంటింగ్ సజావుకు రాజకీయ పక్షాలు సహకరించాలి
కలెక్టర్ హరి చందన
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లతో కౌంటింగ్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అభ్యర్థులు,వారి ఏజెంట్లకు వివరిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 4 హాల్ ల లో ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కోహాల్లో 24 టేబుల్ ఉంటాయని ,మొత్తం 96 టేబుల్ లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఒక్కో టేబుల్ కు ఒక ఏజెంటును అభ్యర్థులు నియమించుకోవచ్చని, అలాగే రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఒక ఏజెంట్ లేదా అభ్యర్థిగాని ఉండవచ్చని తెలిపారు. ఈ నెల 2 లోపు ఏజెంట్ల పేర్లు, ఫోటోలు ఇచ్చి వారి ఐడెంటిటీ కార్డులను తీసుకోవాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజైన జూన్ 5న ఉదయం 6 గంటలకు అభ్యర్థులు,వారి ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ దగ్గర హాజరు కావాలని ,వారి ఎదురుగానే బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్కు తరలించడం జరుగుతుందని వెల్లడించారు.

ఆరోజు ఉదయం 8 గంటలకు కచ్చితంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏజెంట్లు అందరూ ఉదయం 8 గంటలలోపే వారికీ కేటాయించిన టేబుల్ ల వద్ద ఉండాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వాటర్ బాటిళ్లు, ఇంకు పెన్నులు, సెల్ ఫోన్లు వంటివి అనుమతించడం జరగదని, అలాగే ఆహార పదార్థాలకు సంబంధించి బయట పెయిడ్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్కడ డబ్బులు చెల్లించి వారికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని, కౌంటింగ్ హాల్లో ఏజెంట్లు పూర్తి నిశ్శబ్దం పాటించాలని , ఇనిషియల్ కౌంటింగ్, ఒక్కో టేబుల్ పై బ్యాలెట్ పేపర్లు బండిల్స్, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, రెండో ప్రాధాన్యత ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై జిల్లా కలెక్టర్ వివరంగా వెల్లడించారు. ఎన్నికల ఏజెంట్లు పెన్సిళ్లు, జెండాలు, పార్టీ గుర్తుల వంటివి ధరించి కౌంటింగ్ కేంద్రంలోకి రాకూడదని అన్నారు. సీనియర్ అధికారులైన అదనపు కలెక్టర్లను కౌంటింగ్ హాల్స్ కు ఇన్చార్జ్ అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు.ఏజెంట్లకు పెన్నులు ,పేపర్లతో సహా సరఫరా కౌంటింగ్ హాల్లో చేయడం జరుగుతుందని, అభ్యర్థులు ,ఏజెంట్లు ఎం ఎల్ సి ఎన్నికల ఓట్ల లెక్కింపును సీరియస్ గా తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరు పని చేయకూడదని అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ తో పాటు, అందరూ అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏఆర్వోలు దుప్పలపల్లి గోదాం వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.