తన కోరిక తీర్చలేదని కూతురుని
హత్య చేసిన తండ్రి
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి..
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఈ నెల 7న కనబడకుండా పోయిన మైనర్ బాలిక(12) అనంతరం అనుమానాస్పద స్థితిలో మృతికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రి ప్రధాన సూత్రధారిగా తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను మియాపూర్ ఏసీపీ నరసింహా రావు, మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్, ఎస్సై రాజులతో కలిసి వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక మృతి కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఈనెల మొదటి వారంలో నరేష్, శారద దంపతులు మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, ఎల్లంపేట గ్రామం నుండి మియాపూర్ నడిగడ్డ తండాకు వలస వచ్చారు.
ఓ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ, మద్యం సేవిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు. రోజూ మొబైల్ లో పోర్న్ వీడియోలు చూస్తుండేవాడు. అయితే రెండు రోజులుగా అతని ఫోన్ డిస్ప్లే పని చేయకపోవడంతో అతను మరింత ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో నరేష్ కూతురు ఊరు వెళ్తానని చెప్పడంతో ఇదే అదునుగా భావించిన నరేష్ ఆమెను బస్సు ఎక్కించి వస్తానని చెప్పి బైక్ పై తీసుకెళ్లి మియాపూర్ మెయిన్ రోడ్డు పైకి వచ్చాడు. అనంతరం అక్కడి నుంచి ఆమెను అదే బండి పై తిరిగి నడిగడ్డ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లాడు. తన కోరిక తీర్చాలంటూ బాలిక మీద ఒత్తిడి చేశాడు. అయితే ఆ బాలిక అమ్మకు చెప్తానని గట్టిగా అరవడంతో ఇంట్లో వాళ్లకు చెప్తే తన పరువు పోతుందన్న భయంతో ఏ మాత్రం కనికరం లేకుండా జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. బాలిక ముక్కు, చెవులలో నుండి రక్తం కారడం తో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కొన్ని రోజుల తర్వాత బాలిక ఆచూకీ లభించడంతో పోలీసులు తమదైన పద్దతిలో విచారణ చేపట్టారు. నాలుగు టీమ్ లను ఏర్పాటు చేసిన మియాపూర్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విచారణలో బాలిక తండ్రి నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్దారణకు వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు బాలిక తండ్రి ఒప్పుకున్నాడని ఏసీపీ నరసింహ రావు తెలిపారు.
