అమ్మ ఆదర్శ పాఠశాల
పనులన్ని పూర్తి చేయాలి
కలెక్టర్ నారాయణ రెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులన్నీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఎల్లారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆఖస్మిఖంగా తనిఖీ చేశారు .పాఠశాల తరగతి గదులు, వంటగది, తాగునీటి సౌకర్యం, ప్రహరీ ,పాఠశాల ఆటస్థలం, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను పరిశీలించి వివరాలను హెడ్మాస్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో టాయిలెట్స్ తో పాటు, తాగునీటి మరమ్మతులు, తరగతి గదుల మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందని,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వీటన్నిటిని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.పాఠశాల ప్రహరీ ఎత్తు పెంచాలని, పాఠశాలలకు అనుకొని ఉన్న స్థలాన్ని చదును చేస్తే విద్యార్థులు ఆడుకునేందుకు అనువుగా ఉంటుందని ,అదేవిధంగా పాఠశాల హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ఆనుకొని ఉండటం ,రోడ్డు నుండి పాఠశాలకు మల్లే చోట మలుపు ఉన్నందున ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ,ప్రహరీ చిన్నగా ఉండటం వల్ల సాయంత్రం, రాత్రి సమయాలలో పాఠశాలలోకి జులాయిలు వస్తున్నారని, పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ముందుగా ఆమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పూర్తి చేసిన తర్వాత రెండవ విడత తక్కిన సమస్యలన్నింటిపై దృష్టి సారిస్తామని కలెక్టర్ తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. బయోలాజికల్ సైన్స్ పాఠం జరుగుతుండగా, డిజిటల్ విధానం ద్వారా పిల్లల పరిజ్ఞానాన్ని, డిజిటల్ బోధన తీరును ఆయన పరిశీలించారు. మొత్తం పాఠశాలలో 109 మంది విద్యార్థులు ఉన్నారని, సరిపోయినన్ని తరగతి గదులు, సౌకర్యాలు ఉన్నాయని పాఠశాల హెడ్ మాస్టర్ జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు.

గత సంవత్సరం 25 మంది పదవ తరగతి విద్యార్థులకు గాను 22 మంది ఉత్తీర్ణత సాధించారని, ఒకరికి 9.2 జిపిఏ వచ్చిందని తెలిపారు.జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలో సైతం విద్యార్థులు 10 కి 10 జిపీఏ వచ్చే విధంగా కష్టపడి చదవాలని, పాఠశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ,మనిషి జీవితంలో 22 సంవత్సరాల వయసు వచ్చేవరకు చాలా ముఖ్యమైన సమయమని, ఎట్టి పరిస్థితిలలో దీనిని వృధా చేసుకోవద్దని, అలాగే చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరికీ వారు వారిని తీర్చిదిద్దుకునేందుకు కష్టపడి చదవడం ఒక్కటే మార్గం అని తెలిపారు.డిఆర్ డిఓ, మండల ప్రత్యేక అధికారి నాగిరెడ్డి,పంచాయతీరాజ్ ఈఈ భూమన్న, డిప్యూటీ ఇంజనీర్ మహేష్ ఎంపీడీవో ఉమేష్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.