చెర్వుగట్టుకు మౌళిక సదుపాయాల కల్పన

చెర్వుగట్టుకు మౌళిక సదుపాయాల కల్పన

కలెక్టర్ నారాయణ రెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన చేరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ జిల్లా కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.అనంతరం దేవాలయ కార్యనిర్వహక అధికారి గదిలో జిల్లా కలెక్టర్ దేవాలయ అధికారులతో పాటు ,వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ముఖ్యంగా చెరువుగట్టు పై ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర దేవాలయానికి ప్రతిరోజు, ప్రతి అమావాస్యకు, అదేవిధంగా ప్రతి సంవత్సరం నిర్వహించే జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు. వీరందరికీ సరిపోయే విధంగా రవాణా సౌకర్యం, తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్తు వంటి సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ప్రస్తుతం చెరువుగట్టు పైకి వెళ్లే రహదారులతోపాటు, ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల సంఖ్య, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, రోడ్లు అన్నింటిపై కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు .

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు గట్టుపై ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్రం నలుమూలలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని అందువల్ల గట్టు పైకి వచ్చే రహదారులను డబుల్ రోడ్డు చేసేందుకు, అదేవిధంగా ఘాట్ రోడ్డు సైతం డబుల్ రోడ్డు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటికి సంబంధించి మిషన్ భగీరథ ద్వారా ఉదయ సముద్రం నుంచి గోపలాయపల్లి మిషన్ భగీరథ డబ్ల్యూటీపి ద్వారా చెరువుగట్టుకి తాగునీటిని అందిస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతిరోజు 3 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని, ముఖ్యమైన రోజులలో 7 లక్షల లీటర్ల నీరు, జాతర సమయంలో 12 లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కి తెలిపారు.

 

ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కింది నుండి చెరువుగట్టు పైకి పైప్ లైన్ తోపాటు, డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని పక్కగా ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయిలో శాశ్వత ప్రణాళిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు.

అదేవిధంగా ప్రస్తుతం చెరువుగట్టు వద్ద 64 టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, అమావాస్య రోజు 30 నుండి 40 వేల మంది భక్తులు వస్తున్నందున బహిరంగ మల,మూత్ర విసర్జన జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ దృష్టికి రాగా, తక్షణమే దానిని నిరోధించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించాలని, అలాగే గ్రామపంచాయతీ ద్వారా పూర్తిస్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరాపై సైతం కలెక్టర్ సమీక్షించారు.

దేవాలయ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, ఖర్చులు తగ్గించడంపై దృష్టి సారించాలని, సిబ్బంది బాధ్యతగా పనిచేసే విధంగా చూడాలని, ఉన్నవారితో సాధ్యమైనంత వరకు మంచి పని తీసుకోవాలని, రెగ్యులర్ పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాబోయే సంవత్సరంలో దేవాలయానికి కావాల్సిన అవసరాలపై ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు . వీటన్నిటినిపై ప్రణాళికలు రూపొందించలని వచ్చే గురువారం మరోసారి సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రత్యేకించి అమావాస్య రోజు వచ్చే భక్తుల కోసం అవసరమైనన్ని టాయిలెట్లు, వసతికై వెంటనే తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని, అలాగే వాహనాల పార్కింగ్ కు సైతం ప్రణాళిక చేయాలని, కింది నుండి చెరువుగట్టు పైకి వచ్చే రహదారులకై శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని,ఈ నాలుగు అంశాలకు సంబంధించి దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలతో సమీక్ష కు హాజరు కావాలని ఆయన అధికారులనుఆదేశించారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మహేంద్ర కుమార్, ఆలయ ఈవో నవీన్ కుమార్, మండల ప్రత్యేక అధికారి, డిఆర్డిఓ నాగిరెడ్డి, పంచాయతీరాజ్ ఈ ఈ భూమన్న, ఎంపీడీవో ఉమేష్, వివిధ శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking