ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయండి
–ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మంలో జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించి సత్వరమే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఖమ్మం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి తుమ్మల జిల్లా కలెక్టర్ నగర కమిషనర్ తో క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముస్లిం మత పెద్దలతో చర్చించి ఖమ్మం నగరంలో అవసరమున్న చోట ఖబరస్థాన్ షాది ఖానా ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోనీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రత పచ్చదనం ఉండేలా చూడాలన్నారు.శిథిలావస్థ లో ఉన్న సోషల్ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ తో పాటు ఇతర ప్రభుత్వ స్కూల్స్ ఏవైనా ఉంటే తక్షణమే ఖాళీ చేసి వాటిని కూల గొట్టి నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.అవసరమున్న చోట తాత్కాలిక భవనాల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ లో శానిటేషన్ విషయంలో అపరిశుభ్రత ఉందని అసౌకర్యంగా ఉందని ప్రజల నుంచి పిర్యాదులు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం నగరంలో వరద నీరు ఎక్కడ నిలవకుండా డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా మెరుగు పరచాలని సూచించారు. సారథి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి సత్వరమే ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.గోళ్ళ పాడు ఛానల్ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రైవేట్ స్థలాల్లో పరిశుభ్రత ఉండేలా యజమానులకు తగిన ఆదేశాలు జారీ చేసి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పౌర సమాజానికి పెను విపత్తుగా మారిన గంజాయి డ్రగ్స్ మహమ్మారి ఖమ్మంలో కనపడకుండా చేయాలన్నారు. వెలుగు మట్ల అర్బన్ పార్క్ ప్రజలకు ఆహ్లాదం పంచేలా మౌలిక వసతుల కల్పన చేయాలని మెయిన్ రోడ్ నుంచి పార్క్ వరకు రహదారి మంజూరు అయింది నిర్మాణం సత్వరమే చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు. అర్బన్ పార్క్ లో ఆహ్లాదం కోసం ఏయే శాఖలు నిర్మాణం చేపట్టాలో శాఖల వారీగా నివేదిక తయారు చేయఆలని వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను మణి హారంలా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.