మేమూ జర్నలిస్టులమే…
మాకూ ఇవ్వండి ఇళ్ళ స్థలాలు
–మంత్రి పొంగులేటికి గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
గ్రేటర్ హైదరాబాద్ లో పనిచేస్తున్న మేమూ జర్నలిస్టులమేనని, మాకూ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ నాయకులు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, డైరెక్టర్లు రామారావు, ఉద్రసీన్ తదితరులు శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య తమ సొసైటీ వివరాలను మంత్రికి వివరించారు.
దాదాపు పదిహేను సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఇళ్ళ స్థలాల సమస్యను పరిష్కరిస్తూ, ఆ సొసైటీలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని, అదే సమయంలో తమ సొసైటీకి కూడా స్థలం కేటాయించి అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. 2008లో ఏర్పడిన తమ సొసైటీలో దాదాపు 1400 మంది జర్నలిస్టులున్నారని, వీరిలో చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం గత పదిహేనేళ్ళుగా ఎదురు చూస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు కాలయాపన చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులంతా తమకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారని మంత్రితో అన్నారు.
*అర్హులైన జర్నలిస్టులందరికీ ఇస్తాం*
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ సొసైటీకి కోర్టు ఆదేశం మేరకు మొదట ఇవ్వడం జరుగుతుందని, మిగతా సొసైటీల కు త్వరలో ఇస్తామని హామీ ఇచ్చారు.