కోట్లు మింగిన “రాజు “

కోట్లు మింగిన “రాజు “

అవినీతి సామ్రాట్ నరేంద్రుడు 

దూలపల్లి సొసైటీ
నిధులు గోల్ మాల్

రైతుల సొమ్మును మింగిన
చైర్మన్ నరేందర్ రాజు

సొసైటీ నిధుల పక్కదారిపై పాలకమండలికి అధికారుల సమన్లు..

ఆడిట్ లో బట్ట బయలు

6 కోట్ల రుణాలకు వడ్డీ
సైతం చెల్లించని వైనం

సమన్లు జారీచేసినా
సొసైటి బేఖాతర్

మేడ్చల్, అక్షిత బ్యూరో :

కంచే చేను మేసింది. కాపాలాదారే కాజేశాడు. నేనే రాజు… నేనే మంత్రిలా వ్యవహరించిన నరేందర్ రాజు కోట్లు మింగాడు. రక్షించాల్సి నోడే భక్షించాడు. రైతుల సొమ్ము రాజు గండి కొట్టాడు. నీకింత నాకింత అన్న చందంగా కోట్లు కొల్లగొట్టాడు. రైతుల సంక్షేమం.. ప్రగతిని కాంక్షించాల్సిన చైర్మన్ సొసైటీ నిధులు పక్కదారి పట్టించి కోట్లు మింగినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. సొసైటీ నిధులు, ఆస్తులను పరిరక్షించాల్సిన సంఘం చైర్మనే ఆయా నిధులను కాజేశాడు. సొసైటీ నుంచి రైతులకు ఆసరాగా నిలిచేందుకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, రైతుల సాగుకు అవసరమైన చిన్న, సన్న కారు, దీర్ఘ కాలిక రుణాలు అందించాల్సి ఉంది. ఆయా రుణాలను పక్కదారి పట్టించి కోట్ల రూపాయలను సహకార బ్యాంక్, సొసైటికి పంగనామాలు పెట్టారు. ఆదర్శంగా ఉండాల్సిన ఛైర్మన్, పాలక మండలి అవినీతి బురద అట్టించుకుండ్రు. బ్యాంకు లావాదేవీలపై ఆడిట్ అధికారులు విచారణ జరిపి నిధుల గోల్ మాల్ పై నిగ్గు తేల్చారు.

వివరాల్లోకి వెళ్తే…కుత్బుల్లాపూర్ నియోజక వర్గo కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి సహకార సంఘం సొసైటీ చైర్మన్ పనితీరు అవినీతి సామ్రాట్ గా చరిత్ర కెక్కారు. డైరెక్టర్లకు ఆదర్శవంతంగా ఉంటూ బాధ్యతా యుతంగా మెదులుతూ చేపట్టాల్సిన ఆ పదవిని అవినీతి మరకలు అంటించి ఆ పదవికి మచ్చ తెచ్చేశారు. నిబంధనలు ఉల్లంఘించి తన స్వార్థం కోసం ఇష్టాను సారంగా లోన్లు ఇచ్చి కోట్ల రూపాయల బ్యాంకు సొమ్ముకు గండి కొట్టారు. ఈ విషయమై ఆరోపణలు వెలుగు చూడడంతో మేడ్చల్ జిల్లా సహకార సంఘం అధికారులు పాలక మండలికి ఫైల్ నెంబర్ 01/2024 ప్రకారం ఎంక్వయిరీ సమన్లు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దూలపల్లి పిఏసీఎస్ బ్యాంకు పాలక మండలికి అధికారులు నోటీసులు ఇవ్వడంతో చైర్మన్ గరిసే నరేందర్ రాజు అవినీతి బాగోతం బట్టబయలైంది.వెంటనే వివరణ ఇవ్వాలని చైర్మన్ తో పాటు 12మంది సింగిల్ విండో డైరెక్టర్లకు, పాత పాలక మండలి డైరెక్టర్లకు సమన్లు అందడంతో డైరెక్టర్లు అయోమయానికి లోనవుతుండ్రు.

*పాలక మండలికి సమన్లు జారీ*

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి (ప్యాక్స్ )ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ టీబిసి 395 సొసైటీ బ్యాంకులో కోట్ల రూపాయల ప్రజల సొమ్ము, బ్యాంకు నిధులు, లోన్ల రూపంలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిగా ఇచ్చి భారీగా అవకతవకలు జరిగాయని ఆడిట్లో మేడ్చల్ జిల్లా సహకార సంఘం అధికారులు గుర్తించారు.

అవకతవకలపై వివరణ ఇవ్వాలని సొసైటీ చైర్మన్ గరిసె నరేందర్ రాజుతో పాటు, 12 మంది డైరెక్టర్లకు, బ్యాంక్ అధికారులకు మేడ్చల్ జిల్లా సహకార సంఘం అసిస్టెంట్ రిజిస్టర్ నాగేశ్వర్ రావు ఆగస్టు 8న సమన్లు, నోటీసులు జారీ చేశారు. ఆగస్ట్ 27 వరకు చైర్మన్ తో పాటు డైరెక్టర్లు అవకతవకలపై వివరణ ఇవ్వాలని కోరగా విస్మయానికి గురైన డైరెక్టర్లు తమకు తెలియదని కొంతమంది, కొంతమంది అంతా చైర్మన్ చూసుకుంటాడని, విషయం బయటకి రానివ్వకుండా సమన్లు ఇచ్చి 20 రోజులు దాటినా కాలయాపన చేస్తున్నారు.

*సహకార సంఘం అంకురార్పణ*

దూలపల్లి పిఏసీఎస్ 2003లో ఏర్పాటు అయ్యింది. అప్పుడు చైర్మన్ గా బూరుగుబావి సత్యనారాయణ ఉండగా 12మంది డైరెక్టర్లు ఉన్నారు. తరువాత మరో పాలకమండలి చైర్మన్ నవీన్ గుప్తా ఆధ్వర్యంలో 12మంది డైరెక్టర్లు పాలకమండలిగా వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019 లో నూతన పాలకవర్గం చెర్మన్ గా గరిసే నరేందర్ రాజు 12 మంది సింగల్ విండో డైరెక్టర్లతో పాలక మండలి ఏర్పాటు అయ్యింది. ప్రజల ఆదరణతో అభివృద్ధి చెందిన సొసైటీ దాదాపు 50 నుండి 100 కోట్ల టర్నోవర్ కు చేరింది. ఇదే అదునుగా భావించిన కొంత మంది అవినీతి సామ్రాట్లు పరిమితికి మించి లోన్లు తీసుకుని కట్టకుండా బకాయిలు పడ్డారు. ఈ కారణంగా బ్యాంకుకు గండి పడే విధంగా తయారు అయ్యిందని రైతులు వాపోతున్నారు.
నిబంధనల ప్రకారం (ఎల్ టి)లాంగ్ టర్మ్ లోన్ లు ఏవైనా ఆస్తిని మార్టిగేజ్ చేసుకుని పాలక మండలిలో ఉన్న సింగిల్ విండో డైరెక్టర్లు తీర్మానం ప్రకారం లోన్ లు అందించాలి. క్రాప్ లోన్ లు ఎకరాకు 40వేలు చొప్పున రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే ఎలిజిబిలిటీ ప్రకారం లోన్ అందించాలి. నిబంధనలు తుంగలో తొక్కిన పాలక మండలి సభ్యులు తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా తయారై నిధుల గోల్ మాల్ కు శ్రీకారం చుట్టారు. మీటింగ్ లో డైరెక్టర్ లకు ఇచ్చే 5 వేల కవర్ కు ఆశ చూపి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి

నిధుల గోల్ మాల్
బయట పడిందిలా..

దూలపల్లిలో కొంత మంది రైతులు తమకు లోన్ కావాలని దూలపల్లి ప్యాక్స్ సహకార బ్యాంకుకు వెళ్లగా నిధులు లేవని సీఈఓ సమాధానం ఇచ్చారు. 50 నుండి 100కోట్ల టర్నోవర్ ఉన్న ఇంత పెద్ద బ్యాంకులో నిధులు లేకపోవటం ఏమిటని రైతులు నిలదీశారు. దీంతో అసలు విషయం బయట పడింది. బ్యాంకు సొసైటీ చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు లోన్స్ తన అనుచరులు, బినామీలకు ఇచ్చారని అవి వసూల్ కావటం లేదని సమాచారం.

నిధుల స్వాహాకు…అడ్డదారి

దూలపల్లి ప్యాక్స్ బ్యాంకులో ఛైర్మెన్ అవినీతికి పాల్పడాడ్డని, నిబంధనలు ప్రకారం వ్యవహా రించాల్సిన చైర్మన్ తానే సొంతంగా ఖాతా నెంబర్ 118 తెరిచి లోన్ నెంబర్లు 29, 33, 30, 68, 80, 99, 352, 370 లపై మొత్తం 8 లోన్లు 5 నుండి 6 కోట్ల రూపాయలు లోన్స్ నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్నాడని బకాయిలు చెల్లించడం లేదని ఇతనితో పాటు కొంతమంది డైరెక్టర్లు కూడా బకాయిలు ఉన్నారని అందుకే చైర్మన్ ను ప్రశ్నించడం లేదని తెలిపారు, బకాయిలు పెరిగిపోవడంతో నిధుల కొరత ఏర్పడి సేవింగ్ అకౌంట్ దారులకు సైతం తమ డబ్బును విత్ డ్రా చేసుకోలేని పరిస్థితి నెలకొందని, వెంటనే ఈ స్కాంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార సంఘం అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అప్పటి డిసిఒ రాజేందర్ రెడ్డి దూలపల్లి ప్యాక్స్ బ్యాంకు అవకతవకలను గుర్తించి డైరెక్టర్లకు, చైర్మన్ లకు సమన్లు జారీ చేశారు.

ఆడిట్ లో వెలుగులోకి…

దూలపల్లి రైతుల ఫిర్యాదు మేరకు ఆడిట్లో విచారణ జరిపిన జిల్లా సహకార సంఘం అధికారులు పలు అంశాలపై విచారణ చేపట్టారు. ఫిక్స్ డ్ డిపాజిట్ల సేకరణలో ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం టిడిఎస్ వసూలు చేశారా..? పాలక మండలిలో తీర్మానం లేకుండా హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఎల్ టి లోన్స్, గోల్డ్ లోన్స్ పరిమితికి మించి ఎందుకు ఇచ్చారు ? బైలాస్ ప్రకారం సొంత జిల్లా వారికి కాకుండా ఇతర జిల్లాల వారికి లోన్ ఎందుకు ఇచ్చారు ? కో ఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 54 ప్రకారం న్యాయ సలహా లేకుండా, మార్టిగేజ్ లేకుండా , నిబంధనలు ఉల్లంఘించి లోన్లు ఎందుకు ఇచ్చారు? యాక్ట్ బి ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చిన 58 రుణాలు తిరిగి ఎందుకు వసూలు చేయడం లేదు. యాక్ట్ 3 ప్రకారం ఇచ్చిన 60 రుణాలలో బకాయి దారులు లోన్ చెల్లించకుంటే చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు ?సొసైటీలో చైర్మన్ ఒక్కడే 8 రుణాలు తీసుకుంటే డైరెక్టర్లు ఎందుకు అడ్డుకోలేదు. డైరెక్టర్లు సైతం లోన్ తీసుకొని చెల్లించకుంటే సొసైటీ సభ్యత్వానికి అనర్హులే అన్న విషయం మీకు తెలుసా? లేదా? పాలకమండలి మీటింగ్లో 5వేలు కవర్ సిట్టింగ్ ఫీజు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం కాదా అంటూ ప్రశ్నిస్తూ డైరెక్టర్లకు, చైర్మన్ కు నియమావళి ఉల్లంఘనపై ఆగస్టు 8న సమన్లు జారీ చేశారు. దీంతో ఉలిక్కిపడిన పలువురు డైరెక్టర్లు బయటపడే దారిని వెతికే ప్రయత్నంలో పడ్డారు. దూలపల్లి ఫ్యాక్స్ లో జరిగిన లోన్ల భారీ స్కాంలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది త్వరలో తేలనుంది. ఫిర్యాదు దారులు పేర్కొన్నట్టు ఛైర్మెన్ తీసుకున్నారా ? తీసుకుంటే ఎంత చెల్లించారు ? ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది ?ఇక్కడి వారికి కాకుండా ఇతర జిల్లాలకు వారికి కూడా లోన్ ఇచ్చారా? చైర్మన్ తో పాటు మరో ప్యాక్స్ చైర్మన్ సైతం ఇక్కడి నుండి లోన్ పొందాడని, జిల్లా సహకార సంఘం అధికారి కూడా దూలపల్లి బ్యాంకు నుండి రుణం తీసుకున్నాడని, లోతుగా విచారణ జరిపి ప్రభుత్వ ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ వినిపిస్తుంది.

ప్రతి పైసా కక్కిస్తాం 

మేడ్చల్ జిల్లా డిసిఓ వెంకట్ రెడ్డి

దూలపల్లి పాక్స్ లో జరిగిన లోన్లు గోల్ మాల్ పై డిసిఓ వెంకటరెడ్డిని వివరణ కోరగా తాను వచ్చి వారం రోజులు అవుతుందని రాగానే తమ విభాగంలో ఏసీబీ దాడులు జరిగి బిజీగా ఉన్నామన్నారు, దూలపల్లి స్కాంపై త్వరలో విచారణ జరుపుతామన్నారు. సొసైటీ యాక్ట్ ప్రకారం ఎవరు తప్పు చేసినా, లోన్లు పొంది బకాయిలు చెల్లించకున్నా పైసాతో సహా వసూలు చేస్తామన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిసిఓ వెంకటరెడ్డి తెలిపారు. కాగా, ఇదిలా ఉంటే అవినీతికి పాల్పడిన చైర్మన్ రాజకీయ పలుకుబడితో బయట పడతారా? మింగిన రైతుల సొమ్మును అధికారులు కక్కిస్తారా?
లేదో ? వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

Breaking