కబ్జా చేసి రోడ్డేసిన ల్యాండ్ మార్క్

ల్యాండ్ మార్క్ దర్జాగా కబ్జా

పడిగసముద్రం కుంట ఎఫ్ టి ఎల్ లో దర్జాగా సిసి రోడ్డు..

ఓ బడా నిర్మాణ సంస్థకు పరోక్షంగా సహకరిస్తున్న మూడు శాఖల అధికారులు..

సారేగూడం గ్రేవీయార్డు, పడిగసముద్రం కుంటను ఆక్రమంచి 40ఫీట్ సిసి రోడ్డు నిర్మాణం

ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ స్వలాభం కోసమే ప్రభుత్వ స్థలంలో సిసి రోడ్డు నిర్మాణం అంటూ విమర్శల వెల్లువ..

సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు

మేడ్చల్, అక్షిత బ్యూరో :

హైడ్రా సెగలు ల్యాండ్ మార్క్ కు తాకట్లే. ఏకంగా పడిగసముద్రంకుంట ఎఫ్ టిఎల్ నుంచే దర్జాగా రొడ్డేసింది. గ్రామస్తులు అడ్డుకున్నా… అధికారుల సహకారంతో ల్యాండ్ మార్క్ దర్జాగా కబ్జా చేసి రోడ్డేసింది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తోంది. చెర్వులు, కుంటలు, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉంటే కూకటి వేళ్ళతో కూల్చివేస్తుంటే ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేట్ కు ఎలాంటి భయం లేకుండా కబ్జాలకు కాలు దువ్వుతుంది. హైడ్రా గుబులు ల్యాండ్ మార్క్ కు తాకట్లేదు. హైడ్రా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు అడ్డుకోవాల్సింది పోయి అక్రమార్కులకు పరోక్షంగా సహకరించడం తోనే ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నాయం టూ విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలో డిపిపల్లికి ఆమ్లెట్ గా ఉన్న సారేగుడెంలోని సర్వీ నంబర్ 200,200/1లో రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. గ్రేవీయార్డు కోసం ప్రభుత్వం కేటాయించింది. ఓ బడా నిర్మాణ సంస్థకు సరైన అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో ప్రభుత్వ స్థలంపై కన్నుపడింది. అధికారులను, ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని అడ్డదారిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి సొంత నిధులతో 40 ఫీట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే సగం సిసి రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు ఆదివారం అడ్డుకొని ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ హైడ్రా పేరుతో కుంటలు,చెరువుల పరిరక్షణ తోపాటు ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తుంటే కొందరి అవినీతి అధికారుల చేష్టలతో ప్రభుత్వ, ప్రజాప్రయోజన స్థలాలు అన్యాక్రాంతం అవుతుండడం ఆందోళన కలిగించే విషయం.

పడిగసముద్రంకుంట గ్రేవీయార్డును ఆక్రమంచి
సిసి రోడ్డు నిర్మాణం

డిపిపల్లిలోని లేక ఐడి 2870 పడిగసముద్రంకుంట విస్తీర్ణం 6.846 ఎకరాలు, సారేగుడెం గ్రేవీయార్డు 2 ఎకరాలకు పైగా ఉంటుంది. కోట్ల విలువ చేసే మూడు ఎకరాల భూమిని ఆక్రమించి సొంత నిధులతో త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నా మూడు శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

వివాదాలకు కేరాఫ్ గా త్రిపుర ల్యాండ్ మార్క్ సంస్థ

దుండిగల్ మున్సిపాలిటీలో 10 సంవచ్చారాల క్రితం నిర్మాణాలు మొదలుపెట్టిన త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. త్రిపుర ల్యాండ్ మార్క్- 2 లో అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో బౌరంపేట పెద్ద చెరువు కరకట్ట బఫ్ఫర్ జోన్ ను ఆక్రమించి 20 విల్లాలు నిర్మించడంతో అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. త్రిపురల్యాండ్ మార్క్-3లో సైతం కోమటి కుంటను ఆక్రమించి విల్లాలు నిర్మిస్తుండంతో ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. త్రిపురల్యాండ్ మార్క్-5లో రోడ్డు కోసం తక్కువ ధరలో భూమిని కొట్టేసేందుకు ఓ భూయజమాని బెదిరించి దాడికి యత్నించడంతో త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణదారుడు పసుపులేటి సుధాకర్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో నాన్ బైలబుల్ కేసులు నమోదయ్యాయి. అయినా అతని తీరు మారడంలేదు. నిజాంపేటకు చెందిన బిఆర్ఎస్ కార్పొరేటర్ అండతోనే బరితెగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అడ్డుకున్న గ్రామస్తులు

సారేగుడెం గ్రేవీయార్డుతో పాటు, పడిగసముద్రం కుంటను ఆక్రమించి త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ 40 ఫీట్ రోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు సిసి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకొని ఆందోళనకు దిగారు.స్థానిక కౌన్సిలర్ రాము గౌడ్ ను వివరణ కోరగా గ్రేవీయార్డులో సిసి రోడ్డు నిర్మాణం చేపడితే సహించేది లేదన్నారు.పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

మున్సిపాలిటీ నుండి అనుమతి లేదు

త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సిసి రోడ్డుపై దుండిగల్ మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణరావును మీడియా వివరణ కోరగా సిసి రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ నుండి ఎటువంటి అనుమతిలేదని, మున్సిపల్ నిధులు కేటాయించలేదన్నారు. అనుమతిలేకుండా నిర్మిస్తున్న సిసి రోడ్డును తొలగిస్తామన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking