*ఆదర్శ కాలనీ స్నిగ్ధలో అక్రమ నిర్మాణాలు…*
*అక్రమ నిర్మాణాల అనుమతికై కాలనీ కమిటీకి ముడుపులు?*
*అక్రమ నిర్మాణాల పై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి.*
—- *సామాజిక ప్రజా సంఘాల డిమాండ్*
యాదాద్రి భువనగిరి, అక్షిత బ్యూరో :
భువనగిరి పట్టణ శివారులోని స్నిగ్ధ కాలనీ “ఆదర్శ కాలనీగా” కాలనీవాసులు నామకరణం చేసుకున్నారు. కాలనీలో జిల్లా స్థాయి ఉన్నత ఉద్యోగులు, స్థిరాస్తి వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు మొదలైన వారు నివాసం ఉంటున్నారు. భువనగిరి లో సంపన్నుల కాలనీగా పేరుగాంచిన “ఆదర్శ కాలనీ” లో ఇటీవల కొందరు కాలనీ కమిటీ సభ్యులు కాసులకు కక్కుర్తి పడి కాలనీలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
బొమ్మయిపల్లి, టీచర్స్ కాలనీ నుండి స్నిగ్ధ కాలనీ లోనికి వచ్చే ప్రధాన రహదారిపై ఒకరు ఇటీవల నూతన ఇంటి నిర్మాణం చేస్తూ, నడిరోడ్డుపై అక్రమంగా డ్రైనేజీ పైపు లైన్ వేస్తున్నారు. గతంలో రోడ్డు చివర్లో ఉన్న పాత డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణం తన ఇంటి పక్కనే ఉందని ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించి, నడి రోడ్డుపై కొత్త పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం చట్ట విరుద్ధం. అక్రమ నిర్మాణాలకు, అభ్యంతరం తెలిపిన కాలనీ “ఆదర్శ కమిటీ” కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినట్లు సమాచారం. భువనగిరి మున్సిపల్ కమిషనర్ తో సహా అనేకమంది పెద్దలు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నివాసం ఉండే కాలనీలో అక్రమ నిర్మాణాలు జరగడం ఏంటని భువనగిరి ప్రజలు, సామాజిక కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారిలో భవిష్యత్తులో డ్రైనేజీ పైప్ మరమ్మతులు చేయాల్సి వస్తే రోడ్డు మధ్యలో తవ్వాల్సి వస్తుంది. కాలనీ వాసులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భువనగిరి మున్సిపల్ అధికారులు వెంటనే కాలనీ సందర్శించి, అక్రమ నిర్మాణాలు తొలగించాలని, కేవలం ఒక్క కుటుంబం సౌలభ్యం కోసం పదిమందికి అంతరాయం , నష్టం కలుగకుండా చూడాలని సామాజిక కార్యకర్తలు కొడారి వెంకటేష్ , ఎండీ ఇంతియాజ్ లు కోరారు. ఒకవేళ భువనగిరి మున్సిపల్ అధికారులు స్పందించక పోతే జిల్లా కలెక్టర్, మున్సిపల్ రాష్ట్ర స్థాయి అధికారులకు పిర్యాదు చేస్తామని వారన్నారు.