బుద్ధవనం అభివృద్ధికి
₹100 కోట్లివ్వండి
గజేంద్ర సింగ్ షెకావత్ కు రఘువీర్ వినతి
న్యూ ఢిల్లీ, అక్షిత ప్రతినిధి :
నల్గొండ లోక్‌సభ ఎంపీ రఘువీర్ రెడ్డి కుందూరు, నేడు న్యూ ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వారి అధికార నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్, బుద్ధవనం అభివృద్ధి కోసం *”స్వదేశ దర్శన్ పథకం 2.0″* క్రింద ₹100 కోట్లను మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ “చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రదేశాలను గ్లోబల్ టూరిజం గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఎత్తిపోతల జలపాతం, నాగార్జున కొండ, మరియు బుద్ధవనం వంటి ప్రధాన ఆకర్షణల అభివృద్ధి, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈకో-ఫ్రెండ్లీ నివాసాల అభివృద్ధితో పాటు, జాతీయ-అంతర్జాతీయ స్థాయి వినోద కార్యక్రమాలను ఈ ప్రాంతంలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

ఈ ప్రాంతాల అభివృద్ధి స్థానిక ఉద్యోగావకాశాలు పెంచడంతో పాటు తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదని విశ్వసిస్తున్నానన్నారు. కేంద్ర మంత్రి ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారని ఎంపీ రఘువీర్ రెడ్డి తెలిపారు.