అక్రమ కట్టడాలపై కొరడా

అక్రమ కట్టడాలపై కొరడా
పెన్సింగ్, కట్టడాల కూల్చివేత
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అక్రమ కట్టడాలపై రెవిన్యూ అధికారులు పంజా జులిపించారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత ప్రభుత్వ పాలనలో ఆక్రమణలకు గురైన లక్షలాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రెవిన్యూ అధికారులు మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలు, ఫెన్సింగులు తొలగించి ప్రభుత్వ స్థలం పేరిట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నార్కట్ పల్లి- అద్దంకి హైవేపై ఉన్న 626 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ సోదరి రాయపూడి భవానీ ఆక్రమించినట్టు గుర్తించిన రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆదేశాలతో ఆ సర్వే నెంబర్ లో వేసిన ఫెన్సింగ్ ను ఇతర కట్టడాలను తొలగించారు. కాగ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆక్రమణల పేరిట ఫెన్సింగ్ తొలగించడం, కట్టడాలు కూల్చడం పట్ల మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అసహనం వ్యక్తం చేశారు. తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వాస్తవానికి తనకు ఆ సర్వే నెంబర్లోని భూమికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన సోదరి చట్ట ప్రకారం 711 సర్వే నెంబర్ లో 22 గుంటల భూమి కొనుగోలు చేసిందని, పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. ఎలాంటి కొలతలు చేయకుండా కూల్చడం ఏమిటని ఆయన అన్నారు. కాగా 626 సర్వే నెంబర్ లో మూడు గుంటల ఆక్రమణకు గురయ్యాయని ఎటువంటి నోటీసు లేకుండా బౌండరీలు చూపకుండా ఫెన్సింగ్ తొలగించడాన్ని పట్టదారు రాయపూడి భవానీ భర్త ఉమాశేఖర్ ఖండించారు.. తప్పు పట్టారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇలా చేయడం దారుణమన్నారు.

అదేవిధంగా సర్వే నంబర్ 626లోని సుమారు 2 గుంటల భూమిలో కేటాయింపు లేకుండా అక్రమంగా నిర్మాణం ప్రారంభించిన తాపీ, వడ్డీ, వడ్డెర సంఘం భవనాన్ని కూడ కూల్చివేశారు. డిజిటల్ సర్వే ద్వారా సర్వే నంబర్ 626లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందనీ నిర్ధారించిన అనంతరం ఫెన్సింగ్ తొలగించామని తహసీల్దార్ ఎన్.హరిబాబు వివరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల, ఆడవిదేవులపల్లి తహసీల్దార్లు జవహర్, సురేష్, ఆర్ఐలు టీ.రామకృష్ణ, సత్యనారాయణ, శ్యాం, సర్వేయర్ ఎండీ. ఖదీర్ లున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking