పారదర్శకంగా లేని కులగణన
తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ నెలలో 50 రోజుల పాటు చేపట్టిన కులగణన తెలంగాణ దళిత బహుజన సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసిందని ఆ నివేదిక పారదర్శకంగా లేదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో ప్రభుత్వం ప్రకటించిన కులగణన రిపోర్టు తిరస్కరిస్తూ తెలంగాణ విద్యావంతుల వేదిక, బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం, బీసీ రాజ్యాధికార సమితి,అధ్వర్యంలో సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్ ప్రతులను దగ్దం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పందుల సైదులు మాట్లాడుతూ పార్లమెంటు ప్రతిపక్షనేత అయిన రాహుల్ గాంధీ విశాలమైన దృక్పథంతో కులగణనను ఎజెండాగా పెట్టుకుని అయ్యా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం సంపద వికేంద్రీకరణ జరగాలని దీర్ఘ దృష్టితో ముందుకు సాగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను చాలా చులకనగా తీసుకుందని, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక తెలంగాణ బీసీ సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసిందన్నారు.సర్వే చేపట్టిన నాటినుండి అధికారులు కానీ ప్రభుత్వం గానీ సీరియస్ గా తీసుకోలేదని తూతూ మంత్రంగానే ముగించారన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ బీసీ జనాభా పెరగలేదనడం ఆధిపత్య వర్గాల కుట్రలో భాగమేనన్నారు.బీసీ జనాభాను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే బీసీలు ఎక్కడ ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతారో అనే దురుద్దేశంతో ఈ కుట్రలకు తెరలేపారన్నారు. నిబద్ధత శాస్త్రీయత లేని కులగణన నివేదిక ను తెలంగాణ బీసీ సమాజం వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే గ్రామాల వారిగా,వార్డుల వారిగా,మండలాల వారీగా జిల్లాల వారీగా,యూనిట్ గా తీసుకొని ఆయా కులాల జనాభాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేనియెడల పకడ్బందీగా రిసర్వే చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.