బస్సు కోసం బాల్యం ఎదురుచూపు 

*బస్సు కోసం బాల్యం ఎదురుచూపు 
దుబ్బాక, అక్షిత ప్రతినిధి:
తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఈ యుగంలో, అనేక గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు మాత్రం ఇంకా పాఠశాల దారి కోసం ఎదురుచూస్తున్నారు. నడకే ఓ మార్గంగా మిగిలిపోయిన పిల్లల బతుకుల్లో చదువు ఓ లక్ష్యం అయితే, దానికి వెళ్లే మార్గం మాత్రం బస్సు రూపంలో కనిపించట్లేదు. వాస్తవంగా చూస్తే, పాఠశాలలు ఉన్నా వాటికి చేరే రవాణా లేకపోవడం వల్ల పిల్లలలో చదువు పట్ల ఆసక్తి మందగిస్తోంది. దీన్ని చిన్న సమస్యగా చూడకూడదు. ఇది అనేక పేద కుటుంబాల కలలకు బ్రేక్ వేసే విధంగా మారుతోంది.


ప్రతి రోజు తెల్లవారకముందే, ఎంతోమంది పిల్లలు కిలోమీటర్ల దూరం నడిచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లుతున్నారు. వర్షాకాలంలో తడిసిపోతున్నారు. ఎండలో అలసిపోతున్నారు. తమ వయసుకు మించిన శ్రమతో ఓడిపోకే చదువు కోసం పోరాడుతున్నారు. ఒక్కొక్క గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండకపోవడం, ఉన్న అది 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల, బాలబాలికలు ఈ ప్రయాణాన్ని తప్పనిసరిగా ఒప్పుకుంటున్నారు. వీళ్ల వేదనను ఆసక్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ ఇది మనసుని తాకే అంశమే.
ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ఈ చిన్న చిన్న అవసరాలు మరవబడతున్నాయి. పాఠశాలల స్థాయి పెంచటం, బోధనా ప్రమాణాలు మెరుగుపరచటం కన్నా ముందు — పిల్లలు తరగతి గదిలోకి అడుగుపెట్టేందుకు కావాల్సిన రవాణా సదుపాయం ఉండాలి. ఒక బస్సు లేకపోవడం వల్ల చదువు మానేసిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయని గ్రామీణ ఉపాధ్యాయులే చెబుతున్నారు. పిల్లల కడుపు ఆకలిని తట్టుకుంటుంది కానీ, పాదాల బాధను తట్టుకోలేకపోయే వయస్సులో ఈ చిన్నారులు మానసికంగా ఎంతగా ఒత్తిడికి గురవుతున్నారో మనం ఊహించుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థాయి, ఉపాధ్యాయుల నిబద్ధత గతకొంతకాలంగా అభినందనీయంగా మారింది. రాష్ట్రంలోని అనేక మండలాల్లో, గ్రామాల్లోని ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లోని ప్రవేశాల సంఖ్య పెంచేందుకు బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తూ పాటుపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు వంటి అనేక ప్రయోజనాల గురించి గ్రామస్థులకు అవగాహన కలిగిస్తూ, “ప్రైవేట్ పాఠశాలలకు ‌వెళ్ళాల్సిన అవసరం లేదు, మా పాఠశాలనే సరైన దిక్కు” అనే విధంగా తల్లిదండ్రులను బలంగా ఒప్పిస్తున్నారు. ఈ విషయంలో విద్యా శాఖ ఉపాధ్యాయులు తమ బాధ్యతను ఎంతో గౌరవంగా తీసుకుంటున్నారు. ఒక పేద కుటుంబం నుంచి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి మళ్లించడం కొంతమందికి గౌరవంగా మారింది. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజలలో తిరిగి విశ్వాసం కలిగించేందుకు తీసుకున్న సానుకూల దశగా మారింది. అయితే ఇదే సమయంలో, రవాణా సౌకర్యాల లేమి వల్ల ఈ గొప్ప ప్రయత్నాలు పాక్షికంగా నిరర్థకమవుతున్నాయి. చాలా కుటుంబాలు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ముందు అంగీకరించినా, బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల మళ్లీ పాఠశాలకు పంపడం ఆపేస్తున్నారు. పాఠశాలకు తీసుకెళ్లే మార్గం లేకపోవడంతో, శ్రమభరిత నడకల బాటలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. చివరికి చదువు మానేయడం లేదా తిరిగి ప్రైవేట్ పాఠశాలల వైపు మళ్లడం జరుగుతోంది. ఇది ఉపాధ్యాయుల కృషికి గండికొట్టే అంశమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో తిరిగి కలిగిన నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా ప్రమాణాల అభివృద్ధి, ఉపాధ్యాయుల సేవాభావం అన్నీ స్థిరంగా నిలవాలంటే, పిల్లలకు పాఠశాలకు చేరే మార్గాన్ని తేలికపర్చడం అత్యవసరం. రవాణా లేకపోతే చదువుకు చెక్ పడుతుంది. ఇది ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని నిగ్రహించకుండా చేసే మరో అడ్డంకి.
ఇలాంటి సందర్భాల్లో ఒక అంతర్జాతీయ ఉదాహరణ మనందరినీ ఆలోచింపజేస్తుంది. జపాన్‌లో కేయూ‌షూ ద్వీపంలోని కమీషిరాతా ప్రాంతానికి చెందిన ఓ బాలిక తరగతులకు వెళ్లే మార్గం లేకపోవడంతో, అక్కడి రైల్వే శాఖ ఆమె కోసం ప్రత్యేకంగా ఓ ట్రైన్‌ నడిపింది. రోజూ ఆ బాలిక స్కూల్‌కి వెళ్లే సమయానికి మాత్రమే ఆ రైలు ఆ ప్రాంతం గుండా వెళ్లేది. ఆమె చదువు పూర్తయ్యే వరకూ ఆ సేవను కొనసాగించారు. ఈ ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది – ఎందుకంటే అది కేవలం ఒక విద్యార్థిని కోసం ఒక దేశం వేసిన దారిగా నిలిచింది. మనకు ఇది కేవలం కథలా అనిపించవచ్చు కానీ ఆ దేశం విద్యను ఎంతగానో విలువైనదిగా భావిస్తుందనే దానికి ఇది ప్రతీక.
తెలంగాణాలో విద్యార్థుల రవాణా సమస్యను చూస్తే, గణాంకాలు కూడా స్పష్టంగా ఈ సమస్యను తెలియజేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18–22% గ్రామాల్లో తగిన బస్సు సదుపాయం లేదు. గ్రామీణ పాఠశాలల పరిధిలోని పిల్లలలో ప్రతి నాలుగో విద్యార్థి పాఠశాలకు 3 కిలోమీటర్లకు పైగా నడవాల్సిన అవసరం ఎదుర్కొంటున్నారు. యునిసిఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం, రవాణా సౌలభ్యం లేకపోవడమే పాఠశాల మానేసే ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రతిరోజూ భారతదేశంలో సుమారు 1.2 కోట్ల విద్యార్థులు 2 కిలోమీటర్లకు పైగా నడవడం అనివార్యమవుతోంది. ఇదే సమయంలో, పలు పేద కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ పాఠశాలలను ఎంచుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లేందుకు ప్రతి నెల వేల రూపాయల రవాణా ఖర్చు భారంగా మారుతుంద. ఇది వారి ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తోంది. విద్య కోసం కట్టే డబ్బు ఒక్క ఫీజుతో ముగియదు. ప్రయాణ ఖర్చుతో పాటు, మానసిక ఒత్తిడి, భౌతిక శ్రమ అన్నీ కలిపి చిన్నారి భవిష్యత్తుపై భారంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో, పిల్లల విద్యకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వ విధానాలకు, ఈ చిన్న చిన్న మద్దతులు ఒక బస్సు రూపంలో ఎంతో విలువైనవి. ఇది ప్రభుత్వం చేసే పెద్ద ఖర్చు కాదు, కానీ వేల విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపగల సామర్థ్యం కలది. ఒక పాఠశాలకు కనీసం ఒక ప్రత్యేక విద్యార్థి బస్సు ఏర్పాటు చేయడం ద్వారా, చదువు పరంగా నిబద్ధతను చాటినట్లవుతుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా వంటి సంస్థల ద్వారా గ్రామీణ విద్య బస్సులను నడిపే ప్రణాళిక రూపొందించటం – ఈ కాలంలో అత్యవసరం.
చదువుకు దారి ఉంటేనే ఆ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. చదువే మార్గం అనుకుంటున్న పిల్లలకు ఆ మార్గం లేదు అంటే అది మనం చూసే సమాజం ప్రశ్నించబడాల్సిన విషయం. అయితే ఈ వ్యాసం ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాదు. ఇది ఓ చిన్నారి మొరను వినిపించేందుకు చేసే వినతిగా నిలుస్తుంది.
పుస్తకాల్లో వెలిగే కలలు తరగతి గదిలో చేరాలంటే, మొదటగా వీధి దాటి ప్రయాణించాలి. ఆ ప్రయాణానికి మార్గం, దారి, ఆ మార్గానికి బస్సు అవసరం. ఈ రోజు మనం చూస్తున్న ఆశలు రేపటి తెలంగాణ విజయ గాధలు కావాలంటే, చదువుకే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. చదువు కోసం బస్సు రావడం హక్కు కాదు, అవసరం. మరెందుకు ఆలస్యం? పిల్లల కలలకు బస్సు కావాలి.

*వ్యాసకర్త*
భాగన్నగారి రవీందర్ రెడ్డి
ఎం.ఏ జర్నలిజం

Leave A Reply

Your email address will not be published.

Breaking