జర్నలిస్టులకు కేటాయించిన
స్థలాన్ని జర్నలిస్టులకే ఇవ్వాలి
కొల్లాపూర్, అక్షిత ప్రతినిధి :
కొల్లాపూర్ పట్టణంలోని బొంగరాల మిట్ట వద్ద ఉన్న సర్వే నెంబర్ 72లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ గతంలో ప్రొసీడింగ్ వచ్చిందని ఇదే స్థలంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 18 రోజుల నుంచి కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు జర్నలిస్టులకు కేటాయించిన 72 సర్వే నెంబర్ లోని ప్లాట్లను వారు పరిశీలించారు.

ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు బచ్చలకూర కుర్మయ్య అధ్యక్షతన కార్యక్రమాన్ని ఉద్దేశించి టిడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు రామచందర్ నియోజవర్గ కన్వీనర్ జలకం మద్దిలేటిలతో కలిసి టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ మాట్లాడుతూ సర్వే నెంబరు 72 లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రోసిడింగ్ ఇవ్వడంతో పాటు రూ. ఎనిమిది లక్షలు ఖర్చు చేసి బండను బ్లాస్టింగ్ చేసి సదరం చేశారు.కానీ ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఈ ప్రభుత్వం అయినా ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎదురు చూసి తప్పని పరిస్థితుల్లో దీక్షలకు దిగితే ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇళ్ల స్థలాల కోసం దీక్షలు చేస్తున్న జర్నలిస్టులను కార్యకర్తలుగా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగకుండా సర్వే నెంబరు 72 లోనే ఇళ్ల స్థలాలను కేటాయించి పెద్ద మనసు చాటుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు మల్లికార్జున సాగర్, సీనియర్ జర్నలిస్టులు సీపీ నాయుడు, కారంగి గోవిందు,రమణ,భాను ప్రకాష్,మల్లేష్, స్వాములు, రమేష్, తరుణ్, సురేంద్ర, రాము తదితరులు ఉన్నారు.