చేర్యాల పట్టణంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
చేర్యాల అక్షిత ప్రతినిధి: సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి చేర్యాల పట్టణంలో ఆకస్మిక తనిఖీలో భాగంగా బుధవారం మొదట కలెక్టర్ హైమావతి చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది మరియు వైద్యేతర సిబ్బంది హాట్ అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి, మెడిసిన్ స్టాక్ రిజిస్టర్, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్ నిర్వహణ సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. వర్షాకాలం వ్యాధులు వ్యాపించకుండా చూడాలని, ప్రసవాల కోసం ఆసుపత్రికి వచ్చే వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయొద్దని సూచించారు. అదేవిధంగా ఆస్పత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి సరిగా డాక్టర్లు చూస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకొని, వర్షాకాలంలో త్రాగునీరు ప్రతి ఒక్కరు వేడి చేసిన నీటినే తాగాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి భవనాన్ని పరిశీలించి ఆస్పత్రి నిర్మాణం పూర్తయినందున మెయిన్ రోడ్ నుండి ఆస్పత్రి వరకు అప్రోచ్ రోడ్డు, ఆస్పత్రి ఆవరణలో ఇంటర్నల్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఇప్పటివరకు నిర్వహిస్తున్న ఆసుపత్రిలోని పరికరాలను కొత్త భవనంలోకి షిఫ్ట్ చేసి వైద్య సేవలు ఇక్కడ ప్రారంభించేల చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి డాక్టర్ ను మరియు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు భూమిగారి పద్మావతి ఇంటి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరతరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయాలని లబ్ధిదారుకు సూచించారు. చేర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయగా పాఠశాలలో విద్యార్థులు లేకపోవడానికి కారణం విద్యార్థి సంఘాల బంధు పిలుపుతో పాఠశాలకు హాజరైన విద్యార్థులను ఉదయం ఇంటికి పంపించామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. పట్టణంలోని ఆగ్రో రైతు సేవ కేంద్రంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి, గోడౌన్ లో ఎరువుల లభ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధిక మరియు ఏవో భోగేశ్వర్ ను ఆదేశిస్తూ, వానకాలం పంటలకు అవసరమైన యూరియా చేర్యాల మండలంలో 208 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని రైతులు ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేర్యాల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల డిస్పోజల్ పరిశీలించారు.

ఈ సందర్భంగా భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అన్ని దరఖాస్తులకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, భూభారతి దరఖాస్తుల పరిష్కారం పై వారానికి ఒక మండలం చొప్పున కలెక్టరేట్లో సమీక్షిస్తానని పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని తాసిల్దార్ దిలీప్ నాయక్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దామోదర్, చేర్యాల తాసిల్దార్ దిలీప్ నాయక్, మున్సిపల్ కమిషనర్ నాగేందర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.