మాట్లాడిస్తున్నదెవరు ?
కవిత లక్ష్యంగా ఆరోపణలెందుకు?
తెర వెనక ఉన్నదెవరు?
జగదీశ్, కార్తీక్, దేశపతి వ్యాఖ్యలు పార్టీకి లాభమా..నష్టమా !
కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ కు వీరవిధేయులుగా ఉంటూ తమ పబ్బం గడుపుకుంటున్న పలువురు నేతల స్వరం మారుతున్నది. పార్టీ అధినేత కేసీఆర్ కు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ లీకైన తర్వాత కూడా గమ్మున ఉన్న బీఆర్ఎస్ నాయకులు తాజాగా తమ స్టేట్మెంట్లతో వార్తల్లోకెక్కుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పట్టుపట్టి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న కవితను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి చేసిన ప్రకటనలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జుబ్లీ మహాసభను విశ్లేషిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ ఫాంహౌస్ నుంచి లీకైంది. కవిత అమెరికా వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ వార్త రాష్ట్రమంతా గుప్పుమన్నది. ఎయిర్ పోర్టులోనే మీడియాతో మాట్లాడిన కవిత ఆ లేఖ రాసింది తానే అని ఒప్పుకున్నారు. కానీ పార్టీ అంతర్గత విషయంగా ఉండాల్సిన ఉత్తరం బయటకెలా వచ్చిందో చెప్పాలంటూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లరమల్లర వ్యవహారాలు చేసే దయ్యాలు కేసీఆర్ చుట్టూ మూగాయని కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ ఏ మాత్రం స్పందించలేదు. పైగా ఎవరూ మాట్లాడొద్దంటూ పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. అందరి నోళ్లూ మూయించి అంతర్గత చర్చలకే ఈ అంశాన్ని పరిమితం చేయాలనుకున్న బీఆర్ఎస్ అధిష్ఠానం క్రమంగా ఆ అంశం ఏ స్థాయికి దారి తీస్తుందో అంచనా వేయలేకపోయారు.
తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ సంస్థల ద్వారా బీసీ రిజర్వేషన్ల కోసం కల్వకుంట్ల కవిత చేపట్టిన పలు కార్యక్రమాలు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జాగృతి పోరాటం తర్వాత మేల్కొన్న రాష్ట్ర సర్కారు బీసీల కోసం రెండు బిల్లులు ప్రవేశపెట్టడం, వాటిని అసెంబ్లీ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్రపతి ఆమోదం కోసం బీసీబిల్లును పంపించి చేతులు దులుపుకోగా బీఆర్ఎస్ కూడా ఆ అంశాన్ని అంతటితో వదిలేసింది. పలు కొర్రీలు పెట్టి బీజేపీ బీసీ బిల్లును పక్కనపెట్టింది. కానీ వాళ్లెవరూ ఊహించని విధంగా కవిత బీసీబిల్లుకు రాజ్యాంగబద్ధత సాధించాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దూసుకుపోతున్నారు. రైల్ రోకో పిలుపుతో దిగొచ్చిన రాష్ట్ర సర్కార్ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు బీసీ రిజర్వేషన్లపై మాటల యుద్ధాలు చేస్తూ కాలయాపన చేస్తుండగా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాత్రమే ఉద్యమం చేయడం ఆ పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది.
కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేకున్నా జాగృతి సంస్థ తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కవిత పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. తాజాగా బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రపతి ఆమోదాన్ని డిమాండ్ చేస్తూ 72 గంటల నిరాహారదీక్షకు సంకల్పించారు కవిత. తెలంగాణ జాగృతి తరపున ఆగస్టు 4,5,6,7 తేదీల్లో ఇందిరాపార్కు దగ్గర దీక్ష చేయబోతున్నట్లు కవిత ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని అంశంగా మారిందన్నది ఆ పార్టీ ముఖ్య నాయకుల ప్రకటనలు బట్టి తేటతెల్లమవుతున్నది. కవిత అంశం ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదంటూ మాజీమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత కార్యాచరణ ఉంటున్నదని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి ఒక ఇంటర్వూలో చేసిన ప్రకటన కూడా వివాదాస్పదంగా మారింది. కేసీఆర్ కు కవిత రాసిన లేఖపై నోరుమెదపని ఈ నాయకులు ఒక్కొక్కరుగా కవితపై విమర్శలకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీస్తున్నది. తీన్మార్ మల్లన్నను ప్రశ్నించడానికి జాగృతి కార్యకర్తలు వెళ్లిన ఘటనపై దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ కవితను తప్పు పడుతూ చేసిన ప్రకటన నుంచి మొదలైన విమర్శల దాడి క్రమంగా పెరుగుతున్నది. సొంతపార్టీ ఎమ్మెల్సీ కవితను లక్ష్యంగా చేసుకుని సదరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి ఆలోచన మేరకేనా లేక ఆ పార్టీ అదినాయకత్వమే వెనుక ఉండి మాట్లాడిస్తున్నదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ కవితపై చర్య తీసుకోవాలనుకుంటే నేరుగా కేసీఆరే రంగంలోకి దిగి కార్యాచరణ అమలు చేసేవాడని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పార్టీనాయకులతో విమర్శలు, ఆరోపణలు చేయించేంతగా ఆయన దిగజారరని అభిప్రాయపడుతున్నారు. పార్టీ లైన్ దాటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవితపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల కేసీఆర్ ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరినా అది కరెక్ట్ కాదు అని కేసీఆర్ నచ్చచెప్పినట్లు వార్తలొచ్చాయి. చెల్లెలిపై క్రమశిక్షణ చర్యలకు కేటీఆర్ పట్టుపట్టినా కుదరదని స్పష్టం చేసిన కేసీఆర్ దేశపతి శ్రీనివాస్, జగదీశ్వర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి లాంటి నాయకులతో ఇలాంటి ప్రకటనలు చేయిస్తారన్నది అనుమానమే.
తాజా రాజకీయ పరిణామాలను తమ స్థాయిలో అంచనా వేసి బీఆర్ఎస్ నాయకులు సొంత పార్టీ ఎమ్మెల్సీ కవితపై విమర్శలకు దిగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇందుకు విరుద్ధ వాతావరణం ఏర్పడితే వారి పరిస్థితి ఏంటని పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం కష్టం. కవిత చేస్తున్న కార్యకలాపాలను ఇప్పటివరకు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ బహిరంగంగా తప్పుపట్టిన దాఖలాలు లేవు. కానీ దేశపతి, జగదీశ్వర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి లాంటి వారు బాహాటంగా ఆమెను తప్పుపట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకే తీరని నష్టంగా పలువురు భావిస్తున్నారు. ఓటమితో కుంగిపోయి ఉన్న పార్టీకి ఇలాంటి నాయకుల వ్యాఖ్యలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటున్నారు. పార్టీ కేడర్ ను అయోమయం చేసే కుట్ర జరుగుతున్నదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో కేసీఆర్ కు కవితకు మధ్య సానుకూల వాతావరణం ఏర్పడితే ఈ నాయకుల పరిస్థితి ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మహబూబ్ భాషా (సీనియర్ జర్నలిస్ట్)