చారిత్రక ఘట్టం..
72 గంటల కవిత నిరాహార దీక్ష
ఆగస్టు 4, 5, 6, 7 తేదీల్లో
బీసీల కోసం ధర్నా చౌక్ వేదిక
బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదమే డిమాండ్
ఏడాదిన్నర తెలంగాణ జాగృతి పోరాటంలో కీలకఘట్టం
కవిత దూకుడుకు అధికార, విపక్షాల బెంబేలు
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏడాదిన్నర కాలంగా పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత మరో చారిత్రక ఘట్టానికి తెరలేపారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదంతో పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ 72 గంటల దీక్షకు సిద్ధమయ్యారు. కవిత తీసుకున్న ఈ నిర్ణయం అటు అధికార కాంగ్రెస్ పార్టీని, ఇటు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని కదిలించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భుజాలు తడుముకుంటున్నది. కవిత చేపట్టిన ఈ దీక్ష కోసం జాగృతి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించే పనిలో పడ్డారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్ లో జరిగే ఈ దీక్షకు వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నాయకులు కూడా హాజరవబోతున్నారు.
బీఆర్ఎస్ హయాంలోనూ కవిత పోరాటం
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీలకు ఆరాధ్య దైవంగా భావించే జ్యోతీరావు ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యమిస్తున్నారు. మేమెంతో మాకంత అన్న నినాదంతో విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలివ్వాలంటూ ఏడాదిన్నరగా కవిత పోరాటం చేస్తున్నారు. వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టారు. యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. 2024, జనవరి 26న హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత వెనుతిరిగి చూడకుండా పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. తెలంగాణ జాగృతి తో కలిసి పలు బీసీ సంఘాల నేతలు, మేధావులు గళమెత్తారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కౌన్సిల్ ప్రత్యేక సమావేశాల్లో సైతం తన బాణీని బలంగా వినిపించి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ కు తెలంగాణ జాగృతి తరఫున బీసీ సంఘాల నాయకులతో కలిసి నివేదిక అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన కులగణలో పాల్గొని తన వివరాలను కూడా కవిత అందించారు.
జాగృతి ఉద్యమంతో రెండు బిల్లులు
కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఏడాదిన్నరగా తెలంగాణ జాగృతి చేస్తున్న ఉద్యమానికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ స్పందించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అయితే అసెంబ్లీలో మాత్రం మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాలని కవిత పట్టుబట్టారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలకు సంబంధించి బిల్లులు వేర్వేరుగా ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని గుర్తు చేశారు కవిత. సర్కారు తర్జన భర్జన తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులుగా రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ సహా అన్ని పక్షాలు బీసీ బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి సంతకానికి పంపించింది ప్రభుత్వం. రాష్ట్రపతి ఆమోదానికి పంపిన బీసీ బిల్లుపై అటు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు గానీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గానీ ముందడుగు వేయకపోవడంతో బీసీల చిరకాల కోరికకను మోక్షం లభించలేదు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ నుంచి కూడా కదలిక కనిపించలేదు. బీసీలపై ఆయా పార్టీల చిత్తశుద్ధిపై క్రమంగా నమ్మకం సన్నగిల్లే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో మరోసారి కల్వకుంట్ల కవిత ఓ అడుగు ముందుకేసి జులై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కదిలించడం ద్వారా బీసీల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఈ వత్తిడి రాష్ట్రప్రభుత్వంపై కూడా పడింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధమంటూ రేవంత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్సులు శాశ్వత పరిష్కారం కాదని తక్షణమే బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కావలసిందేనంటూ కవిత స్పష్టం చేశారు.
దీక్షతోనే డిమాండ్ల సాధన
బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం రూపొందాల్సిందేనని గుర్తించిన కల్వకుంట్ల కవిత తాజాగా ఆగస్టు 4,5, 6, 7 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద 72 గంటల నిరాహారదీక్షకు సంకల్పించారు. పొడిపొడి మాటలు, శుష్కవాగ్దానాలతో బీసీలకు న్యాయం జరగదని గుర్తించిన కవిత బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే న్యాయం జరుగుతుందని నిర్ణయించారు. ఈ క్రమంలోనే 72 గంటల దీక్షకు ఆమె సిద్ధమయ్యారు. ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. 72 గంటల దీక్షపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు, మహిళలు, విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి 15 ప్రత్యేక బృందాలు గురువారం బయలుదేరి వెళ్లాయి. పలువురు మేధావులు, వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, కులసంఘాలు కవితను కలిసి ఆమె చేపట్టిన దీక్షకు మద్దతు చెప్పారు. బీసీల కోసం ఏడాదిన్నర కాలంగా వివిధ రూపాల్లో ఉద్యమం చేస్తున్న కవిత ఈ 72 గంటల దీక్షను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కవిత చేపట్టిన దీక్ష అటు రాష్ట్రంలోని మిగతా పార్టీలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు హుటాహుటిన బీసీల కోసం కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించాయి. బీసీల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పటిష్ఠమైన ప్రణాళికతో దూసుకుపోతున్న కల్వకుంట్ల కవితను ఫాలో ్వడం మిగతా పార్టీలకు అనివార్యంగా మారినట్లు స్పష్టమవుతున్నది. లేకుంటే జనాభాలో సగభాగమున్న బీసీలకు ఎక్కడ దూరమవుతామో అన్న ఆందోళన ఆయా పార్టీల్లో నెలకొన్నది.

ఎస్ కృష్ణవేణి
9032673669