లక్షలు హెచ్చించారు…    లక్ష్యం మరిచారు

లక్షలు హెచ్చించారు…
   లక్ష్యం మరిచారు

నెక్కొండలో ప్రభుత్వ
భవనం నిరుపయోగం

శిథిలావస్థకు చేరుకుంటున్న
బీసీ బాలుర వసతి గృహం

నర్సంపేట, అక్షిత ప్రతినిధి :

సకల సదుపాయాలతో లక్షలు హెచ్చించి నిర్మించిన భవనం ప్రారంభానికి నోచక నిరుప యోగంగా దర్శనమిస్తుంది. ఏళ్ళతరబడి అది ఖాళీగానే ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నెక్కొండ పట్టణ కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంటోంది. ఏళ్ల తరబడి ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడంపై స్థానికులు, సీనియర్ సిటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెక్కొండ రైల్వే సబ్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ భవనం రెండు అంతస్తుల్లో ఎనిమిది గదులు, విశాలమైన వంటగది, హాలు, బోరు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ, పచ్చని చెట్లతో సహా అన్ని సదుపాయాలను కలిగి ఉంది. ఇక్కడికి సులభంగా వెళ్లడానికి రోడ్డు కూడా అందుబాటులో ఉంది. ఇంత పటిష్టమైన ప్రభుత్వ భవనం ఖాళీగా పడి ఉండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.


ఒకవైపు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేట్ భవనాలకు అద్దెలు చెల్లిస్తూ ఖజానాపై భారం మోపుతున్నప్పటికీ, అందుబాటులో ఉన్న ఈ ప్రభుత్వ భవనాన్ని వాడుకోవాలనే ఆలోచన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు రాకపోవడం విచారకరం. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే భవనం శిథిలమై ఎందుకూ పనికిరాకుండా పోతుందని పట్టణ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ భవనాన్ని ఇతర ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలని లేదా కనీసం బాలుర వసతి గృహంగానైనా తిరిగి ప్రారంభించాలని నెక్కొండ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking