తొలి ముద్ద
పాలమూరుకే
విద్యా, వైద్యం, సాగు
రంగాలకు ఊతం
పరిశ్రమలతో
పాలమూరు ప్రగతి
సాగు నీటి ప్రాజెక్టులకు
గ్రీన్ ఛానల్ తో నిధులు
నిర్వాసితులకు
నష్టం జరుగనివ్వం
చదువుతోనే
మన తలరాతల్లో మార్పు
ఎస్ జిడి కార్నింగ్ టెక్నాలజీస్
ఫర్నేస్ లైటింగ్ ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :
వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సారధ్యం వహిస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఏది వచ్చినా తొలి ముద్ద పాలమూరు జిల్లాకేనని చెప్పారు. పదేళ్లు సీఎంగా
పని చేసిన కేసీఆర్ కొడంగల్-నారాయణపేట
లిఫ్ట్ ప్రాజెక్టును తొక్కిపెట్టి
ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని విమర్శించారు. తాము వచ్చాక రూ. 4వేల కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ముందుకు వెళ్లాలని చూస్తుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు భూసేకరణకు ఎకరానికి రూ. 11 లక్షలు ఇచ్చామని, ఇక్కడ రూ.14 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించినా అయినా సరిపోవడం లేదంటున్నారు. రైతులతో మాట్లాడాలని వెంటనే నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లో భూ నిర్వాసితులకు నష్టం జరగనివ్వమన్నారు. ఇక్కడి ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేయకపోతే మళ్లీ ఇంకెవరూ పూర్తి చేసేవారు రారన్నారు. కలెక్టర్లే రైతుల వద్దకు వెళ్లి వారిని ఒప్పించాలని సూచించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్య, వైద్య రంగాలతో పాటు సాగు నీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం నిస్తూ వలసల పాలమూరు జిల్లాను అభివృద్ధికి కలిసి కట్టుగా
కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ఎస్.జి.డి కార్నింగ్ ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబింగ్ జాయింట్ వెంచర్ ఫర్నేస్ లైటింగ్ ప్రారంభ వేడుకలో రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణా రావు, దేవరకద్ర ఎంఎల్ఏ జి.మధుసూదన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లా నూతన పరిశ్రమలకు వేదిక కాబోతోంది అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు మహబూబ్ నగర్ జిల్లా వేదిక కాబోతున్నందుకు సంతోషంగా ఉందనీ చెప్పారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా వలసలకు మారుపేరనీ, నాటి పాలకులు పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి ప్రపంచ నాయకులను పాలమూరు జిల్లాను చూపించడానికి తీసుకువచ్చేదన్నారు. భవిష్యత్ లో మన అభివృద్ధిని, పరిశ్రమలను, యూనివర్సిటీలను, సాగునీటి ప్రాజెక్టులను చూపించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేలా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అందుబాటులో లేకపోవడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందనీ గుర్తుచేసారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన పాలమూరు రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు వంటి
ఏ ప్రాజెక్టులు సంపూర్ణంగా పూర్తి కాలేదు. ఆనాడు సోనియాగాంధీ పాలమూరు యూనివర్సిటీని మంజూరు చేసినా.. పేరుకే అది యూనివర్సిటీ.. కానీ అది పీజీ కాలేజీగానే మిగిలి పోయిందన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఎంప్లాయిమెంట్ లో మన జిల్లాను అభివృద్ధి చేసుకోకపోతే శాశ్వతంగా జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే ఇంజనీరింగ్, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో పాటు ట్రిపుల్ ఐటీని పాలమూరు జిల్లాకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఒక్కో నియోజకవర్గానికి రూ. 200 కోట్ల చొప్పున రూ. 2800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అంతే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజక వర్గాలలో 14 అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునేవిధంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుందనీ వలసలు వెళ్లే పాలమూరు బిడ్డలు ఆ వలసల బారి నుంచి బయటపడాలంటే చదువొక్కటే మార్గమన్నారు. పాలమూరు జిల్లా నుంచి ఇంజనీర్లు, డాక్టర్లే కాదు, ఐఏఎస్ లు ఐపీఎస్ లుగా ఎదిగి రాష్ట్రానికే కాదు దేశానికి సేవలందించేలా ఎదగాలని తెలిపారు. చదవాలంటే మనకు వసతులు ఉండాలి, ఆ వసతులు అందించే బాధ్యత పాలమూరు బిడ్డగా నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. చదువు కోసం ఎక్కడ ఏది కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఉదండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని మేం ప్రయత్నిస్తుంటే… ప్రతిపక్షాలు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ దుయ్యబట్టారు.ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, పరిశ్రమలు నెలకొల్పాలన్నా భూమి అవసరమని తెలిపారు. రైతులకు ఎప్పటికీ అన్యాయం చేయమనీ, భూసేకరణ విషయంలో రైతులతో మాట్లాడి ఒప్పించి మంచి పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ లు, అధికారులకు సూచిస్తున్నట్లు తెలిపారు.
గతంలో నాయకత్వ నిర్లక్ష్యం వల్లే ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజక్టులు పూర్తి కాలేదనీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
అన్ని అడ్డంకులను అధిగమించి అసంపూర్తిగా ఉన్న పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసుకుందామనీ చెప్పారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఈ రెండే పాలమూరు జిల్లా రూపురేఖలు మారుస్తాయని పునరుద్ఘాటించారు. ఇది నా బాధ్యత, నైతిక ధర్మం అన్నారు. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు బిడ్డ అయిన ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంవత్సరానికి 20 వేల కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి నెరవేరుస్తున్నారని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో పాటు డిగ్రీ కళాశాల, వైద్య శాలలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కురుమూర్తి దేవస్థానానికి ఘాటు రోడ్డు నిర్మాణానికి 110 కోట్లు మంజూరు చేయగా పనులునడుస్తున్నాయన్నారు. దేవరకద్రకు నూతనంగా కోర్టు మంజూరు అయిందన్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నియోజకవర్గం పొడవున జాతీయ రహదారి ప్రాంతాల్లో పరిశ్రమల కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు. దేవరకద్ర నియోజకవర్గంలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీకి కంపెనీ వ్యవస్థాపకులతో మాట్లాడి బ్రహ్మోస్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీకి 30 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిదంగా కొత్తకోట మున్సిపాలిటీలో ఒక డిగ్రీ కళాశాల మంజూరు చేయాల్సిందిగా కోరారు. జాతీయ రహదారి పై ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కాపాడేందుకు ముసాపేట వద్ద ఒక ట్రామా కేర్ యూనిట్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నా రెడ్డి, మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి, వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, నారాయణపేట శాసన సభ్యులు పర్ణిక రెడ్డి, షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్
ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహరెడ్డి,
ఎస్ జిడి టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ సర్జిత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.