సంస్కృతికి ప్రతీక..
గణేష్ వేడుకలు
హనుమాన్ పురలో పూజలు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పాత పట్టణంలోని హనుమాన్ పురాలో ఏర్పాటు చేసిన ఒకటవ నంబర్ వినాయక విగ్రహానికి మంత్రి పూజాధిక్యాలు నిర్వహించి గణేష్ శోభ యాత్రను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గడచిన 30 సంవత్సరాల నుండి ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను, నిమజ్జనాన్ని నిర్వహించుకోవడం సాంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే శాంతియుత వాతావరణంలో వినాయక శోభాయాత్ర, నిమజ్జనం నిర్వహించాలని యువతకు సూచించారు.

ప్రత్యేకించి యువకులు ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని కోరారు. నల్గొండ పట్టణంలో మతసామరస్యంతో పాటు ,అన్ని మతాలను గౌరవిస్తూనే అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని మొదలు పెట్టామని, లతీఫ్ సాహెబ్ దర్గా గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు 150 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్లు నిర్మిస్తున్నామని, 30% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఈ సంవత్సరం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తును ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ అన్ని శాఖల సిబ్బంది గణేష్ ఉత్సవ కమిటీల సహకారంతో క్రమశిక్షణను పాటిస్తూ 9 రోజులపాటు జిల్లాలో గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకున్నారని, గణేష్ శోభాయాత్ర తో పాటు, నిమజ్జనాన్ని కూడా ఇదేవిధంగా కొనసాగించాలని ఆమె కోరారు. నల్గొండ జిల్లాలో ప్రజలు గంగా, జమున ,తెహజీబ్ సాంప్రదాయాన్ని పాటిస్తారని అన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లను మానుకొని మన పూర్వీకులు ఇచ్చిన ఆదర్శాలు, సందేశాల స్ఫురణతో నిమజ్జనంలో పాల్గొనాలని, ఒక సంకల్ప దీక్షతో అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ గణేష్ శోభయాత్ర, నిమజ్జనాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా 2000 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. నల్గొండ పట్టణంలో వెయ్యి మంది పోలీసులను నియమించామని ,టీఎస్ ఎస్పి స్పెషల్ పోలీస్ బెటాలియన్ కూడా జిల్లాకు వచ్చిందని దీనికి తోడు క్రైమ్ టీములను ఏర్పాటు చేశామని, భద్రతపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలోనే పెద్ద ఎత్తున వినాయక శోభాయాత్ర నిర్వహిస్తారని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, అన్ని మతాలవారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ముందుగా హనుమాన్ నగర్ గణేష్ విగ్రహ కమిటీ అధ్యక్షులు ఇటుకల కృష్ణయ్య మాట్లాడారు. నల్గొండ ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి ,గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కర్నాటి యాదగిరి, వక్త వెంకట్ నివాస్ ,చింతల సాంబమూర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ,మాజీ జెడ్పిటిసి, లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించారు.