పోలీసులను బెదిరించిన అద్దె ఇంటి కబ్జాదారుల అరెస్ట్
కార్యదర్శి ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు
పినపాక / అక్షిత న్యూస్ :
అద్దె ఇంటిని ఆక్రమించడమే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా బేకరీ నడుపుతూ, ఇంటి యజమానిని మాత్రమే కాకుండా అధికారులను సైతం బెదిరిస్తూ ఇల్లు మొత్తాన్ని కబ్జా పెట్టడానికి యత్నించిన శనగల పవన్ కుమార్, బోగటి రమాదేవి అనే ఇద్దరు నిందితులను ఎట్టకేలకు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యాపారం నడుపుతూ, హై కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ అధికారులపై కూడా దాడి చేస్తున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హై కోర్టులో నల్లపు రమాదేవి, కర్లపూడి సతీష్, సాయిని సాంబశివరావులు హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తక్షణమే పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా ఏడూళ్ళ బయ్యారం స్టేషన్ హౌస్ ఆఫీసరుకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు, పంచాయతీ కార్యదర్శి కబ్జా చేసిన ఇంటిని ఖాళీ చేయించాలని ప్రయత్నించగా కబ్జా దారులు ప్రభుత్వ అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. పంచాయతీ కార్యదర్శిని నానా దుర్భాషలాడుతూ నెట్టివేయడమే కాకుండా వారిపై దాడి చేయడానికి వెళ్లగా రక్షణ కోసం వెళ్లిన ఎస్సై, సిబ్బందితో కలిసి వారిని అడ్డుకున్నారు. పోలీసులు నచ్చ జెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంతేకాకుండా ఖాళీ చేయించడానికి పోలీసులతో సహా వెళ్లిన ఏడూళ్ల బయ్యారం పంచాయతీ కార్యదర్శి ముత్తిరెడ్డి జైపాల్ రెడ్డితో “నిన్ను చంపి జైలుకు వెళతాను” అంటూ శనగల పవన్ కుమార్ తీవ్రంగా బెదిరించాడు. దీనిపై పంచాయతీ కార్యదర్శి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈరోజు ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు, అక్రమ కబ్జాలో ఉంటూ ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు, దొంగతనాలు చేస్తూ ఇంటి యజమానినే లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేసిన విషయమై నిందితులపై పలు కేసులలో అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఈ కేసుల్లో ఏ1 శనగల పవన్ కుమార్, ఏ2 గా భోగటి రమాదేవిలు ఉన్నారు. ఇప్పటికే నిందితులపై నాటుసార కేసులు, దొంగతనం కేసు, మరికొన్ని కేసుల్లో నాన్ బెయిలబుల్ వారంటూ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇన్ని రోజులుగా కబ్జా దారులకు సహకరిస్తూ తమపై చేస్తున్న కుట్రలో భాగస్వాములైన మరి కొంతమందిపై తదుపరి చర్యలు ఉంటాయని పిటిషనర్లు తెలిపారు.