ఆరోగ్య మిత్ర రజతోత్సవాలు.. సేవా కార్యక్రమాల పోస్టర్ల ఆవిష్కరణ

ఆరోగ్య మిత్ర రజతోత్సవాలు.. సేవా కార్యక్రమాల పోస్టర్ల ఆవిష్కరణ

నర్సంపేట, అక్షిత ప్రతినిధి:

ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్న ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ రజతోత్సవాల (2000-2025) పోస్టర్లు, కరపత్రాలను ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ సంస్థ 25 ఏళ్లుగా అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆమె కొనియాడారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్‌తో కలిసి విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీపీ సరిత ఐపీఎస్ రజతోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ సరిత మాట్లాడుతూ, తన తొలి పోస్టింగ్‌లో తెలంగాణలో పనిచేసినప్పటి నుంచి ఆరోగ్య మిత్ర సంస్థ కార్యక్రమాలలో తాను పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. డీఎస్పీగా నర్సంపేటలో పనిచేసినప్పుడు ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. విద్యా, వైద్యం, పర్యావరణం, యువత, ఆత్మహత్యల నివారణ వంటి అనేక అంశాలపై ఈ సంస్థ 25 సంవత్సరాలుగా నిరంతరంగా చేపడుతున్న కార్యక్రమాలు హర్షణీయమని పేర్కొన్నారు. రజతోత్సవాలను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని 25 వేల మందికి ఉపయోగపడేలా, 25 నెలల పాటు, 25 ప్రాంతాల్లో, వివిధ సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని ఆమె ప్రశంసించారు. ఇటువంటి సామాజిక కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు.


డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ఆరోగ్య మిత్ర సంస్థ తెలంగాణలోని 33 జిల్లాల్లో 189 రోజుల పాటు బైక్ యాత్ర చేసి, దాదాపు 8 లక్షల మందికి ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేసిందని తెలిపారు. అంతేకాకుండా, రైల్వేలో సాధారణ భోగీల పెంపు కోసం దేశవ్యాప్తంగా ప్రధానికి కోటి ఉత్తరాల ఉద్యమాన్ని చేపట్టి విజయం సాధించిందని వివరించారు. ఈ కృషి ఫలితంగా ప్రస్తుతం ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలులో నాలుగు సాధారణ బోగీలు అందుబాటులోకి వచ్చాయని ఆయన చెప్పారు. గత 20 ఏళ్లుగా ఆత్మహత్యల నివారణపై సంస్థ చేపట్టిన కార్యక్రమాల వల్ల 28 మంది ప్రాణాలు కాపాడగలిగామని, తెలంగాణ డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో పోలీసులకు ఈ అంశంపై సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆరోగ్య మిత్ర రజతోత్సవాలకు అందరూ సహకరించి, ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర సంస్థ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ చిందం రాధా కిషన్, సామాజికవేత్త బెజ్జంకి ప్రభాకర్, పద్మ బ్రాహ్మణ సంఘం తెలంగాణ నాయకులు మలిపెద్ది కృష్ణశాస్త్రి, సంస్థ తెలంగాణ ప్రతినిధి సహజ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking