- యూరియా కోసం క్యూల్లో రైతుల వేదన
- యూరియా అమ్మకాల్లో అడ్డగోలు ధరలు రైతుల అగ్రహం
- రూ.270 కి దొరకాల్సింది రూ.320కి కొన్నాం రైతుల ఆవేదన
- సంక్షోభంలో రైతులు పంటల భవిష్యత్తు ప్రశ్నార్థకం
- వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం లాభాలే లక్ష్యం
- రైతు సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి
నాగారం, అక్షిత న్యూస్: యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సందట్లో సడేమియాల యూరియా విక్రయదారులు రైతుల అవరాలను ఆసరాగా చేసుకొని అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. నాగారం మండల కేంద్రంలో పీఏసీఎస్ కేంద్రం లేకపోవడంతో ప్రభుత్వం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియాను సరఫరా చేస్తుంది. ఇలా ప్రవేట్ ఫెర్టిలైజర్ షాప్ యజమానులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రూ.266.50కే యూరియాను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వమే రవాణా చార్జీలు భరించి యూరియా సరఫరా చేస్తుంది. కానీ సదరు విక్రయదారులు రవాణా చార్జీ, హమాలీ చార్జీలంటూ యూరియాను రూ.300 నుంచి రూ.310లకు రైతులకు విక్రయిస్తున్నారు. పంటలు ఎండిపోతాయని భయంతో రైతులు బలవంతంగా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ దందా వెనుక ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణలో లోపనీనని స్పష్టమవుతుంది. ఎరువుల షాపులను తనిఖీ చేయాల్సిన బాధ్యత మొదట మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) దే, వారే సరైన ధరలకు విక్రయం జరుగుతుందో లేదో అని పర్యవేక్షించాలి. జిల్లా వ్యవసాయ అధికారి (డిఏఓ) చిన్న స్థాయిలో మొత్తం వ్యవస్థను రెవిన్యూ అధికారులు, మార్కెటింగ్ విభాగం కూడా తనిఖీ చేయాలి. అంతిమంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమాలను అరికట్టాలని విశ్లేషకుల అభిప్రాయం. కానీ వాస్తవం ఏమిటంటే రైతులు చెబుతున్నట్లు మా వద్ద ఎవరూ తనకికి రారని, షాపు యజమానులు ఇష్టానుసారం రేట్లు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. అయినా రైతులు యూరియా దొరికితే చాలు అన్నట్లుగా అధిక ధరైన సరే కొనుగోలు చేస్తున్నారు. రైతుల చెమటతో పండే పంటను కాపాడేందుకు యూరియా ఎరువు ప్రధానమైంది, కానీ ఈ దశలో అధిక ధరలకు అమ్మడం కొనసాగితే పంట దిగుబడులు తగ్గి, రైతు కష్టాలు పెరగడం ఖాయమని పలువురు మేధావులు తెలుపుతున్నారు. రైతుల ఆర్థిక స్థితి మరింత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నా వారిపై అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వం అందిస్తున్న ధరలకు యూరియాను అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు
ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి కృష్ణకాంత్‌ను వివరణ కోరగా యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదని తెలిపారు. యూరియా లోడ్ వచ్చినప్పుడు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడే ఉంటూ రైతులకు యూరియా సరఫరాచేస్తున్నామని తెలిపారు.