- జలధారంతా వేడి నీళ్లే !
- వేడి నీళ్లతోనే సాగు
- ఊరంతా ఉబికి వచ్చే “పాతాళ గంగ “
- అందరి దృష్టిని ఆకర్షించిన *పగిడేరు ..
- భూగర్భ శక్తి రహస్యాల వైపు చూపే సహజ అద్భుతం
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి: అదొక పల్లెటూరు. జలధారంతా వేడి నీళ్లే. తవ్విన కొద్దీ వేడి నీళ్ళే… ఊరంతా వేడినీళ్లే. ఎక్కడైనా బోరు వేస్తే సహజంగా ఉప్పు నీరు…లేదా మంచి నీరు వస్తుంది. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఎంత లోతు తవ్వినా… తవ్విన కొద్దీ… వేడి నీళ్ళే వస్తాయి. మోటార్ లేదు, కరెంటు లేదు… అయినా నీరు జలపాతంలా పొంగిపోతోంది. అదీ చల్లని నీరు కాదు,పొగలు కక్కేంత వేడిగా! అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామం.ఇదే విశిష్టతతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళితే…భూమి పొరల గుండె*
లోతుల్లోనుంచి ఉబికి వస్తుంది. దాదాపు నలభై ఏళ్ల క్రితం సింగరేణి సంస్థ బొగ్గు అన్వేషణ కోసం వేసిన బోరు బావుల నుంచే ఈ అద్భుతం వెలుగులోకి వచ్చింది. వెయ్యి మీటర్ల లోతు నుంచి ఉబికి వస్తున్న నీటి ఉష్ణోగ్రత 180–200 డిగ్రీల వరకు చేరుకుంటుంది. పైకి వచ్చే సరికి కూడా 81 డిగ్రీల వేడి వదలని ఈ జలధారలు నేటికీ నిరంతరంగా పొంగిపోతూనే ఉన్నాయి.
వేడి నీళ్లతోనే సాగు..
రైతులు సాగుకు వేడి నీళ్లే పారుగంత. తొలుత ఈ నీటిని వాడేందుకు గ్రామస్థులు భయపడ్డారు. కానీ కాలక్రమేణా ఆ వేడి నీటిలో ఎటువంటి హానికర ప్రభావం లేదని గ్రహించిన తర్వాత, దానినే సాగుకు వాడటం మొదలుపెట్టారు. రైతులు ఒకరోజు వేడి నీటిని కుంటల్లో నిల్వ చేసి, మరుసటి రోజు చల్లారిన తర్వాత పొలాల్లో వాడుతున్నారు. ఇలా ప్రస్తుతం సుమారు 200 ఎకరాల భూమి ఈ వేడి నీటితోనే పచ్చగా సాగువుతుంది.
శాస్త్రవేత్తల అంచనాలు
బొగ్గు గనులు విస్తరించి ఉండటం, గోదావరి పరివాహక ప్రాంతం కావడం వల్ల భూగర్భంలో రసాయనిక మార్పులు చోటు చేసుకుని నీరు ఈ స్థాయిలో వేడిగా వస్తోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో వేడి నీటి వనరులు ఎన్నో ఉన్నా, పగిడేరు ప్రత్యేకత ఏమిటంటే ! ఇక్కడి నీరు నిరంత రాయంగా, దశాబ్దాలుగా ఒకే ఉత్సాహంతో పొంగి పోతుండటమే.
విద్యుత్తు ఉత్పత్తికి దారి
ఈ భూగర్భ వేడి ఆవిరిని వినియోగించి విద్యుదుత్పత్తి చేయాలనే ఆలోచనతో సింగరేణి సంస్థ ఇప్పటికే ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసి విజయవంతమైంది. దీనిని బట్టి రానున్న రోజుల్లో 200 మెగావాట్ల స్థాయి జియోథర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేంద్రం కూడా దీనికి ఆమోదం తెలిపింది.
పగిడేరు – దేశానికి గర్వకారణం
మోటార్ల అవసరం లేకుండానే ఉబికి వచ్చే వేడి నీరు, రైతుల సాగుకు బాసటగా నిలవడమే కాక, విద్యుత్తు ఉత్పత్తికి మార్గం చూపుతోంది. ఇలాంటి విశిష్ట వనరుతో పగిడేరు గ్రామం, భారతదేశ భూగర్భ శక్తి పటంలో ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది.
