పనిలో ఐక్యత, స్వేచ్ఛలో గౌరవం సర్దార్ పటేల్ 

  • పనిలో ఐక్యత, స్వేచ్ఛలో గౌరవం సర్దార్ పటేల్ 
  •  సీబీసీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్’ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “”పనిలో ఐక్యత, స్వేచ్ఛలో గౌరవం సర్దార్ పటేల్ దేశానికి ఇచ్చిన కానుక” అని పేర్కొన్నారు.

1948 సెప్టెంబర్ 17వ తేదీకి గల చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూ… హైదరాబాద్ విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. “హైదరాబాద్ రాష్ట్రం భారతదేశ ఆత్మలో విలీనమైన రోజు అది. రజాకార్ల నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ హైదరాబాద్ ప్రజలు దృఢంగా నిలిచారు. వారు పోరాటం చేశారు.. బాధలుపడ్డారు… చివరికి విజయం సాధించారు. వారి జ్ఞాపకాలను గౌరవించడం.. వారి కథను భవిష్యత్ తరాలకు అందించడం మన పవిత్ర కర్తవ్యం” అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ విముక్తి ఉద్యమంలో భాగమైన చారిత్రక సంఘటనలు, పోరాట యోధుల వ్యక్తిత్వాలను వర్ణిస్తూ సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన రాష్ట్రంలోని పౌరులందరికీ చేరాలని జిష్ణు దేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రూపొందించిన “లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంస్థాన్” వర్చువల్ ఎగ్జిబిషన్‌నూ గవర్నర్ ప్రారంభించారు. సాలార్‌ జంగ్ మ్యూజియం సహకారంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం (ఎన్‌సీఎస్ఎమ్) అభివృద్ధి చేసిన ఈ గ్యాలరీ నిజాం పాలనను, నాటి సామాజిక-ఆర్థిక పరిస్థితులు, ఉప్పొంగిన జాతీయవాదం, హైదరాబాద్ సంక్షోభం, ఆపరేషన్ పోలో, ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనమైన చరిత్రనంతా వివరంగా ప్రదర్శించింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. హైదరాబాద్ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన నిర్ణయాత్మక పాత్రను గుర్తు చేసుకున్నారు. “హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ పటేల్ భారత్‌లో విలీనం అయ్యేలా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి, ప్రతియేటా విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి కట్టుబడి ఉంది’’ అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్ రావు, పీఐబీ-సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సమర్ నందా, ఇతర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన దాదాపు 50 ప్యానెళ్లతో కూడిన నాలుగు రోజుల ప్రదర్శన ఈ నెల 14 నుంచి 17 వరకు నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రజల సందర్శన కోసం తెరిచి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking