రిసెప్షన్ రద్దు.. ప్రతి రైతుకు బస్తా యూరియా
సీఎం రేవంత్ కు రూ.2 కోట్లు బత్తుల విరాళం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : కుమారుడి వివాహ రిసెప్షన్ రద్దు చేసుకొని… ప్రతి రైతుకు బస్తా యూరియా ఉచితంగా ఇచ్చేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నడుంబిగించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి రూ.2 కోట్ల విలువైన చెక్ ను అందజేశారు.

వివరాల్లోకి వెళితే…కుమారుడి రిసెప్షన్ అంగరంగ వైభవంగా చేయాలని… దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రిని ముఖ్యఅతిథిగా తీసుకురావాలని తలంచిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) తన కుటుంబ సభ్యుల మహోన్నతమైన ఆలోచనలతో రిసెప్షన్ రద్దు చేసుకొని ఖర్చు చేయాలనుకున్నా 2 కోట్ల రూపాయలను మిర్యాలగూడ రైతుల సంక్షేమం కోసం వినియోగించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు. విస్తృతమైన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజా ఆదరణ పొంది గెలుపొందిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ తన సేవా కార్యక్రమాలను మాత్రం మరువలేదు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారి ఇబ్బందులను తొలగించేందుకు నియోజకవర్గంలోని ప్రతి రైతుకు ఒక యూరియా బస్తా ఉచితంగా అందజేసేందుకు సంకల్పించారు. ఎమ్మెల్యే ఆలోచన విధానాలను పుణికిపుచ్చుకున్న కుమారుడు సాయి ప్రసన్న, కోడలు వెన్నెలలు తమ రిసెప్షన్ ఆడంబరంగా వద్దంటూ, రైతు సంక్షేమం కోసం వినియోగించాలంటూ తెలియజేయడంతో కుటుంబ సభ్యులంతా వారి గొప్ప ఆలోచనకు మద్దతుగా నిలిచారు. రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న రెండు కోట్ల రూపాయలను గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ అందజేశారు.ఆ డబ్బును రైతు సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఎమ్మెల్యే బిఎల్ ఆర్ కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, బిఎల్అర్ సతీమణి మాధవి, కుమారుడు బత్తుల సాయి ఈశ్వర్ రెడ్డి లు ఉన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఉదారత రైతుల్లో కాసింత ఆనందం పెల్లుబికింది.