హైడ్రా ఆపరేషన్ సక్సెస్
రూ.15 వేల కోట్ల
కబ్జా భూమికి కంచె
గాజులరామారంలో
హైడ్రా ఉక్కుపాదం
సర్వే నంబర్ 307లో 317 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్
భూమిపై బడాబాబుల ఆగడాలకు చెక్
కూల్చివేతలతో ఉద్రిక్తత
భారీ బందోబస్తుతో
ఆపరేషన్
పేదోళ్లను వదిలి.. రియల్టర్లు, నకిలీ ఓఆర్ సి పత్రాల భూములపై హైడ్రా కొరడా
అక్షిత న్యూస్ / గాజులరామారం :
కబ్జా భూములపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. హైడ్రా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. రూ.15 వేల కోట్ల కబ్జా భూమికి కంచె వేసింది. సర్వే నంబర్ 307లో 317 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసింది. ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పటికి భారీ పోలీస్ బలగాల నడుమ కూల్చివేతలకు శ్రీకారం చుట్టి… చుట్టూ కంచె వేసింది.పేదోళ్లను వదిలి నకిలీ ఓఆర్ సిలు సృష్టించి రియల్టర్లు, బడా బాబుల అధీనంలో ఉన్న భూములపై కొరడా ఝళిపించింది. బడా బాబుల
ఆగడాలకు కళ్ళెం వేసింది. హైదరాబాద్ మహానగరంలో అక్రమాలపై హైడ్రా ఆపరేషన్ దూకుడు కొనసాగుతోంది. “ప్రజా భూమి ప్రజలకే చెందాలి. ఆక్రమణ దారులకు కాదు” అన్న నినాదంతో హైడ్రా కొరడా ఝళిపించింది.

కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని 15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించేందుకు ఆదివారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించారు. సర్వే నంబర్ 307లో ఉన్న 317 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్టర్లు, భూస్వామ్య దొంగలు, రాజకీయ ఆశ్రయదారులు అక్రమంగా ఆక్రమించు కున్నారు. కోట్ల విలువైన ఈ భూమిని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించినప్పటికీ, ప్రభావశీలులు , పేదల పేరుతో షెడ్లు వేయించి, గోడలు కట్టి, ప్లాట్లుగా విభజించి అమ్మకాల చేసారు.

ఈ క్రమంలో హైడ్రా కఠిన చర్యలకు దిగింది. జిహెచ్ఎంసి, రెవెన్యూ శాఖ, పోలీసులు, విద్యుత్ శాఖ, హైడ్రా బృందం, ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సహా మరో 200 మందికి పైగా పోలీసు సిబ్బందిని రంగంలోకి దించి ఆదివారం ఉదయం ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు. బందోబస్తుతో ఎకరాల్లోని కాంపౌండ్ గోడలు, కమర్షియల్ షెడ్లు, అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా నేలమట్టం చేశారు. ఇంతకు మునుపే సుమారు 275 ఎకరాలను ఫెన్సింగ్ వేసి భద్రపరిచిన అధికారులు, మిగతా భూమిని కూడా పూర్తిగా ఆక్రమణల నుంచి విముక్తం చేస్తామని ప్రకటించి ఫెన్సింగ్ గోడ కట్టే పనులు ప్రారంభించారు.

అధికారులు స్పష్టంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, చిన్న ఇళ్లలో జీవిస్తున్న పేద కుటుంబాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని. కానీ కోట్ల రూపాయల విలువైన భూమిని మాఫియాతో కలసి దోచుకున్న ప్రభావశీలుల నిర్మాణాలకు పాల్పడిన వారిపై మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు . కూల్చివేతలు ప్రారంభం కాగానే కొంత మంది స్థానికులు ఆందోళనకు దిగుతూ “మా ఇండ్లను కూల్చకండి, దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నాం” అంటూ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. కొంతసేపు పోలీసులు, ప్రజల మధ్య వాగ్వాదం, తోపులాట కూడా చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
హైడ్రా అధికారులు కఠినంగా స్పందిస్తూ – “ప్రజా భూమిని దోచుకోవాలనే కల ఎవరూ కనకండి. ఇకనుంచి అక్రమ ఆక్రమణలకు ఉక్కుపాదం మోపుతాం అని చెప్పారు . భూ మాఫియాను అణచివేసేందుకు ఇలాంటి ఆపరేషన్లు ఇకపై కొనసాగుతాయని స్పష్టం చేశారు.