మెరుగైన యూరియా సరఫరా

మెరుగైన యూరియా సరఫరా

రాష్ట్రానికి ఎప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా

– ఒక్క సెప్టెంబర్ మాసంలోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా

– రబీ సీజన్ కోసం ముందస్తుగానే యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల

– మొదటి మూడు నెలలు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేయాలి

మంత్రి తుమ్మల

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

 

సెప్టెంబర్ నెలలో రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందగా, వీటిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా కావడం ఒక ముఖ్యమైన పరిణామమని తెలిపారు. గత నెలలో ప్రతి సారి కేటాయించిన యూరియా కంటే తక్కువగా సరఫరా అవడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, ఆయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పదే పదే కేంద్రాన్ని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం వలన ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా జరిగిందని అన్నారు.

ఎప్రిల్ నెలలో 1.71 లక్షల మెట్రిక్ టన్నులకు 1.21, మే నెలలో 1.61 లక్షల మెట్రిక్ టన్నులకు 0.88, జూన్ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు 0.98, జులై నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నులకు 1.43, అగస్టు నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు 1.55 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయిన విషయాన్ని గుర్తుచేశారు. దిగుమతి టెండర్లలో ఆలస్యం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడటం, దాని వల్ల కేంద్రం కూడా రాష్ట్రాలకు సరిపడా యూరియాను అందించలేకపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేసిందని వివరించారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనుకాడకుండా రైతుల అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా కేంద్ర మంత్రులను కలవడం, తానే కేంద్రంతో భేటీలు జరపడం, మా ఎంపీలు పార్లమెంట్ అవరణలో నిరసనలు వ్యక్తం చేసి వినతిపత్రాలు సమర్పించడం, అధికారులు కేంద్ర ఎరువుల శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపడం వలన కేంద్రం చివరకు సానుకూలంగా స్పందించి ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా చేసిందని మంత్రిగారు తెలిపారు.

ఆగస్టు నెలలోనే సెప్టెంబర్ కేటాయింపుతో పాటు అప్పటి వరకు ఏర్పడిన లోటును కూడా భర్తీ చేసేలా యూరియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, దానికి అనుగుణంగానే సెప్టెంబర్ మాసంలో కేటాయించిన 1.60 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 25వ తేదీ వరకు 1.84 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి అందాయని చెప్పారు. ఇదే రైతులకు ఊరట కలిగించే అంశమని అన్నారు.

ఇప్పటికే అందిన యూరియాతో పాటు ఈ రోజు, రేపు వరుసగా CIL, IPL-Gangavaram, NFL-Vizag, IPL-Jupiter, IFFCO, Narmada, NBCL-Symphony, SPIC కంపెనీల నుండి మరో 9864 మెట్రిక్ టన్నులు, 9674 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. ఈ యూరియా రైల్వే రేక్ పాయింట్లయిన వరంగల్, మంచిర్యాల, గద్వాల, కరీంనగర్, పందిళ్లపల్లి, జడ్చర్ల, తిమ్మాపూర్ ప్రాంతాలకు చేరుకుంటుందని, అక్కడి నుండి జిల్లాలకు సరఫరా అవుతుందని వివరించారు. అంతేకాక, NFL – Mangala, CIL -Grace, IPL-Gangavara-Jupiter, IPL-Rek Grace, SPIC, KRIBHCO, IPL-Jupiter, NBCL-Wadi, CIL-Ruby కంపెనీల నుండి మరో 34,700 మెట్రిక్ టన్నుల యూరియా రేక్ ప్లాన్ ఉందని, ఇది ఈ నెలాఖరు వరకు రాష్ట్రానికి చేరుకునే అవకాశం చెప్పారు.

గత ఖరీఫ్ సీజన్‌లో ఇదే సమయానికి 9.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగడాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఇప్పటి వరకు జిల్లాలకు 9.50 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేశామని మంత్రిగారు తెలిపారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో జులై నెలలోనే గత ఏడాది కంటే 1 లక్ష మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా అమ్ముడవ్వడం రైతుల అవసరాలు ఎక్కువయ్యాయని, అయితే అప్పట్లో కేంద్రం నుండి సరఫరా తక్కువ రావడం వలన రైతులు కొంత ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. అయినప్పటికీ జిల్లాలకు గత ఏడాది ఇదే సమయానికి కంటే ఎక్కువ యూరియాను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయగలిగిందని చెప్పారు. ఉదాహరణకు నల్లగొండ జిల్లాకు గతేడాది కంటే 5 వేల మెట్రిక్ టన్నులు, పెద్దపల్లికి 3200 మెట్రిక్ టన్నులు, కరీంనగర్ కు 2580 మెట్రిక్ టన్నులు, వనపర్తికి 1600 మెట్రిక్ టన్నులు ఎక్కువగా సరఫరా చేశామని తెలిపారు.

రానున్న రబీ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. రబీ సీజన్ కు వాస్తవ ప్రణాళిక 10.40 లక్షల మెట్రిక్ టన్నులు అని, ఖరీఫ్ లో జరిగినట్టుగా రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే రబీ సీజన్ మొదటి 3 నెలలలో 6 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియాను సరఫరా చేయాలని మంత్రి కోరారు.

రైతుల అవసరాల దృష్ట్యా యూరియా సరఫరా విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిరంతరం ఒత్తిడి చేయడం, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించడం కొనసాగిస్తుందని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking