దళారులను నమ్మొద్దు
కేంద్రాలకు తెచ్చి
మద్దతు పొందాలి
ఫణిగిరి, వర్ధమానుకోటల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తుంగతుర్తి ఎమ్మెల్యే
మందుల సామేలు
నాగారం, అక్షిత న్యూస్ :
ఆరుగాలం కష్టపడి పండించిన
పంటను దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని ఫణిగిరి, వర్ధమానుకోట గ్రామాల్లో పిఎసిఎస్, ఐకెపి సెంటర్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొలుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతు తన పంటను నాణ్యంగా తేమ, మురికి లేకుండా సరిగ్గా వడగట్టి కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ప్రతి క్వింటాకు ధాన్యానికి ప్రభుత్వ రూ. 2389 మద్దతు ధర ఇస్తుందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తహశీల్దార్, మార్కెట్ కమిటి ప్రతినిధులు, అధికారులు, పోలీసులు, సమన్వయంతో వ్యవహరిస్తారని అన్నారు. రైతు హక్కుల పరిరక్షణ కోసం ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, దళారుల చేతిలో రైతులు మోసపోకూడదని, మీ భవిష్యత్తుకు, మీ కుటుంబానికి, పల్లెల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైనదని స్పష్టం చేశారు. దళారులు రైతుల కష్టార్జిత పంటను కొల్లగొడతారని, వారి చేతిలో మోసపోవద్దని అన్నారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తే తమకు పూర్తి మద్దతు ధర లభిస్తుందని, ఆర్థికంగా బలపడవచ్చని రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవకుండా సురక్షితంగా తమ పంటను విక్రయించవచ్చని తెలిపారు. రైతు భీమా, పంట నష్టపరిహారం, రైతుబంధు, ధాన్యం నిల్వ విధానాలు ఇవన్నీ రైతుల భద్రతను పెంచే విధానాలని, ప్రతి రైతు ఈ పథకాలను అర్థం చేసుకొని వినియోగించుకోవాలని తెలిపారు. ఇది కేవలం పంట అమ్మకం మాత్రమే కాదు, మీ కుటుంబ భవిష్యత్తును ఆర్థికపరంగా బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన విధానమని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్, పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, ఏపీఎం వెంకన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకుల బుచ్చిబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తొడుసు లింగయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నెబోయిన వెంకట బిక్షం, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పానుగంటి నరసింహారెడ్డి, ఎల్మకంటి సోమయ్య, గద్దల సైదులు, పాల్వాయి పరశురాములు, మంగదుడ్ల దశరథ, భయ్యం వెంకన్న, యానాల ఇంద్రసేనారెడ్డి, నాతి వీరమల్లు, జంపాల రవి, తహశీల్దార్ హరికిషోర్ శర్మ, ఏవో కృష్ణ కాంత్, ఎస్సై షేక్ యాకూబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.