ఫణిగిరిలో గాలికుంటు వ్యాధి నివారణ శిబిరం
అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలు చికిత్సలు
ఆరోగ్యవంతమైన పశువులే రైతు సంతోషానికి మూలం
ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎఫ్ఎండి టీకా తప్పనిసరి
జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ డి. శ్రీనివాసరావు
నాగారం, అక్షిత న్యూస్ :
రైతు పశువులు కాపాడితేనే కుటుంబం బతుకుతుందని కుటుంబం బతికితే దేశం బలపడుతుందని జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ డి. శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాల పంపిణీ మరియు పశువుల ఆరోగ్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు లేదా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది పశుసంపదకు అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి వల్ల పశువులు కేవలం బాధపడడం కాదు, రైతు ఆదాయం గణనీయంగా పడిపోతుందని, పాల ఉత్పత్తి తగ్గిపోతుందని, పశువుల బరువు తగ్గడం జరుగుతుందని అన్నారు. ఈ సమస్యలన్నీ ముందస్తు టీకాల ద్వారా నివారించవచ్చని అందుకే ప్రతి రైతు సంవత్సరానికి రెండుసార్లు తన పశువులకు వ్యాక్సినేషన్ చేయించాలని స్పష్టం చేశారు. గాలికుంటు వ్యాధి ఫికోర్ణ వీరిడే ఫ్యామిలీకి చెందిన ఓఏసి షాట్1, షార్ట్2, ఆసియా వైరస్ స్పెయిన్ ల వల్ల వస్తుందని, ఈ వైరస్ పశువుల నోటి ద్వారా, పాదాల గిట్టల ద్వారా లేదా కలుస్తమైన మేత, నీరు ద్వారా ఇతర పశువులకు వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ వ్యాధి ప్రబలితే గ్రామంలోని పశుసంపద మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉందని, కాబట్టి నివారిణి మార్గమని తెలిపారు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో తీవ్ర జ్వరం, నోటిలో పుండ్లు, గిట్టల మధ్య గాయాలు, నోటి నుండి చొంగ కారడం, మేత తినకపోవడం, పాల ఉత్పత్తి తగ్గడం, కుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. ముఖ్యంగా మూడు నెలల పైబడిన చిన్న వయస్సు పశువుల్లో ఈ వ్యాధి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉందని సమయానికి టీకాలు వేయిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ప్రతి మూడు నెలల వయసు దాటిన తెల్లా మరియు నల్ల పశువులకు ఎఫ్ఎండి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని అన్నారు. ప్రభుత్వం ఈ టీకాలను ఉచితంగా అందిస్తోందని, పశు వైద్య శాఖ సిబ్బంది ప్రతి గ్రామానికి చేరుకొని రైతుల వద్దకే వచ్చి సేవలు అందిస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఒక పశువు కైనా టీకా వేయకపోతే అది మొత్తం గ్రామానికే ప్రమాదకరమని తెలిపారు. మన పశువుల ఆరోగ్యం అంటే మన గ్రామ అభివృద్ధి అని, పశుసంపద బాగుంటే రైతు బాగుంటాడని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులందరూ వినియోగించుకోవాలని, ప్రతి పశువుకి వ్యాక్సిన్ వేయించడం ద్వారా మన పశుసంపదను పెంపొందించుకోవచ్చని తెలిపారు.ఈరోజు పశు వైద్య శిబిరంలో 143 తెల్ల పశువులకు, 106 నల్ల పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. అదనంగా 10 చూడు పరీక్షలు, 32 అనారోగ్య పశువులకు చికిత్సలు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ సంచాలకులు బి. వెంకన్న, తుంగతుర్తి సహాయ సంచాలకులు డాక్టర్ బి.రవి ప్రసాద్, ఫణిగిరి పశు వైద్యాధికారి డాక్టర్ పి. మౌనిక ప్రియదర్శిని, మండల పశు వైద్యాధికారి డాక్టర్ బత్తుల రవి, వెలుగుపల్లి డాక్టర్ ఎ.నరేష్, పసునూరు జేవివో వై. నాగరాజు, ఎల్ఎస్ఏ టి. మురళి, స్వప్న, పశు వైద్య సిబ్బంది, రైతులు దాసరి ఉపేందర్, బాలె రాములు, టి. అంజయ్య, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.