ప్రజా రక్షణకే
పోలీసుల త్యాగాలు
పోలీస్ అమరుల
త్యాగాలు మరువలేనివి
కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్
మెదక్, అక్షిత బ్యూరో :
ప్రజా రక్షణకే పోలీసుల త్యాగాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రజల ధన, మాన ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తూవిధి నిర్వహణలో అసువులు బాశారన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… 21 అక్టోబర్ 1959 వ సంవత్సరంలో సిఆర్ పియఫ్ – ఎస్ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన ఆర్మీ పై దొంగ దాడి చేసి 10 మందిని జవాన్ లను హతమార్చిందని, ఆ రోజు నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ఫ్లాగ్ డే) గా నిర్వహిస్తున్నం అన్నారు.

ఒక్కొక రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉండేవి మన రాష్ట్రంలో గతంలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో ఎంతో మంది జవాన్లను కోల్పోవడం జరిగిందని, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్ మరియు అస్సాం వంటి కొన్ని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలోనూ అనేక మంది జవాన్లను కోల్పోవడం జరిగిందన్నారు. జమ్ముకాశ్మీర్ లాంటి రాష్ట్రాలలో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులతో ఎంతో మంది పోలీసులు, ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్ర మూకలను హతమార్చి, తమ తనువులను చాలించారని, ఆనాటి వారి ప్రాణత్యాగాల వలననే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అన్నారు. ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో 191-మంది జవాన్లు వీరమరణం పొందారని, ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 5- మంది ఉన్నారు. వీరమరణం పొందిన వారి ప్రాణత్యాగాలను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు వీర జవాన్లు వివిధ సంఘటనలలో నక్సల్స్ మరియు సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలకు బలి అయ్యారన్నారు.

ఇందులో సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీస్ స్టేషన్ కు చెందిన సత్యనారాయణ,కంగ్టి పోలీస్ స్టేషన్ కు చెందిన సురేష్ లు విధి నిర్వహణలో ప్రాణాలర్పించి వీరమరణం పొందారని, వారి ఆత్మకు శాంతి చేకూరలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నానన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని, ఆనాటి వారి ప్రాణత్యాగాల వలననే నేడు మనందరం సుఖ:సంతోషాలతో ఉండగలుగుతున్నాం అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితిలలోనైనా పోలీసు శాఖ ఎదురు నిలబడి, పోరాడటం జరుగుతుందని, అలాంటి పోలీసుల సేవలు మనందరి మదిలో చిరస్మరణీయం అన్నారు. గత జూన్ నెలలో జరిగిన సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శిధిలాల క్రింద చిక్కుకు పోయిన మృతదేహాలను వెలికి తీసి, తమ ధైర్య సహసాలను చాటుకున్నారు అన్నారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అన్నారు. పోలీస్ అమరుల కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారి కుటుంబాల సంక్షేమం, వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను చేకూరేలా, వారి కుటుంబాలలో మనోధైర్యాన్ని అందించటమే పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అన్నారు. అనంతరం పోలీస్ అమరుల కుటుంబసభ్యులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ తో కలిసి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకై ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తూ.. పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. అమరవీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31వ తేదీ “జాతీయ ఐక్యత దినోత్సవం” వరకు ప్రజలకు – పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ. రఘునందన్ రావ్, శ్రీనివాస రావ్, సంగారెడ్డి డియస్పి. సత్యయ్య గౌడ్, జహీరాబాద్ డియస్పి సైదా నాయక్, పటాన్ చెర్వు డియస్పి ప్రభాకర్, నారాయణఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, ఎఆర్ డియస్పి నరేందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ. కళ్యాణి, యస్.బి. ఇన్స్పెక్టర్స్ కిరణ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, జిల్లా ఇన్స్పెక్టర్స్, ఆర్ఐలు రామరావ్, పరేడ్ కమాండర్ – రాజశేఖర్ రెడ్డి, పరేడ్ కమాండర్ డానియెల్, అమరవీరుల కుటుంబ సభ్యులు హాజరై వివాళ్ళు అర్పించడం జరిగింది.